మరోమారు హైటెక్‌ అనిపించుకున్న బాబు

Update: 2020-03-18 02:30 GMT
కులం - మతం - ప్రాంతం - రంగు - ధనిక - పేద ఇలా ఎలాంటి భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తోంది కరోనా వైరస్‌. వారినీ - వీరినీ అంటూ అందర్నీ దత్తత తీసుకుంటోంది. ఆ తాకిడికి యావత్‌ ప్రపంచం అల్లాడిపోతోంది. వైరస్‌ రాకుండా అంతా ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నారు. జనం పోగవడానికి అవకాశం ఉన్న సినిమా హాళ్లు - షాపింగ్ మాళ్లు - స్కూళ్లు - కాలేజీలు - పార్కులు మూతబడ్డాయి. అయితే పార్టీ కార్యాలయాల పరిస్థితేంటి..? స్కూళ్లు - థియేటర్లను మూసేసినట్లు పార్టీ ఆఫీసులకు తాళం వేస్తే కుదురుతుందా..? ప్రెస్‌ మీట్లు ఏం కావాలి..? టీవీల్లో కనిపించనిదే ముద్ద దిగని నాయకులు ఏం చేయాలి..? వీటిని ఓ వైపు ఉంచితే - పార్టీ ఆఫీసును బంద్‌ చేయడమంటే ప్రత్యర్థి బలం పెంచినట్లే. అందుకే అవి తప్పనిసరిగా పనిచేయాలి. అలాగని పార్టీ ఆఫీసు తెరిచివుంచితే కరోనా వస్తుందేమోనని భయం.

ఎప్పుడూ హైటెక్‌ ఆలోచనలు చేసే చంద్రబాబు కరోనా భయానికీ విరుగుడు కనుగొన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసు మూసేయకుండా, అక్కడికి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ టెస్టు చేస్తున్నారు. మంగళవారం నుంచే ఇది స్టార్టయింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటగా స్క్రీనింగ్‌ చేశారు. తర్వాత కార్యాలయానికి వచ్చిన నేతలు - కార్యకర్తలందరికీ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీలు రికార్డయితే, వారిని ఆఫీసు గడప తొక్కనివ్వకూడదని, అటునుంచి అటే వెనక్కు పంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆఫీసుకు వచ్చిన ఎవరికీ శరీర ఉష్ణోగ్రత ఓవర్‌ గా లేకపోయేసరికి - అందరికీ లోపలకు ఎంట్రీ దొరికింది. ఇదేకాదు పార్టీ ఆఫీసులో శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రత్యర్థులపై విరుచుకుపడే రాజకీయ పార్టీలు... కరోనా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతున్నాయి.
Tags:    

Similar News