మదర్ బోర్డు మార్చాల్సిన టైం వచ్చేసింది చంద్రబాబు

Update: 2019-11-15 14:30 GMT
హస్తభూషణంగా మారిన మొబైల్ లో ఎప్పటికప్పుడు ఓఎస్ ను  ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయకుంటే ఏమవుతుంది?  ఏపీలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు అదే తీరులోకి మారింది. టీడీపీ ఓఎస్ ను ఎప్పటి నుంచో అవపోసన పట్టిన జగన్ లాంటి అధినేతకు.. బాబు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా కౌంటర్ ఇస్తే సెట్ అవుతారన్న విషయం మీద ఆయనకున్న అవగాహనకు నిదర్శనం సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయంగా చెప్పాలి.

తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడన్న సామెతను మర్చిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ ప్రత్యర్థి సీఎం జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయటమే ఇప్పుడాయన ఎదుర్కొంటున్న సమస్య. తన పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడూ లేనంత దారుణమైన పరాజయాన్ని పొందిన తర్వాతైనా.. ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏ కారణం తనను అంత దారుణంగా ఓడించింది? అన్న పాయింట్ మీద ఆయన ఫోకస్ చేసి ఉంటే.. తాను చేసిన తప్పుల్ని ఆయన గుర్తించే వారు.

చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విషయాన్ని మర్చిపోవటం.. తలకెక్కిన అహంకారం.. తనకు మించినోళ్లు లేరన్న భావనే.. ఎన్నికల్లో దారుణ పరాజయం పొందేలా చేసింది. ఎన్నికల అంకంలో కీలకమైన పోలింగ్ కు  కాస్త ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లలో పసుపు కుంకుమ పేరుతో కాసిన్ని డబ్బులు వేసినంతనే.. తనకు అండగా నిలిచి ఓట్లు గుద్దేస్తారన్న కాలం చెల్లిన వ్యూహంతో భారీగా దెబ్బ తిన్న బాబుకు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నట్లుగా కనిపించట్లేదు.

సాధారణంగా ఓటమి ఎదురైన తర్వాత.. కనీసం ఏడాది.. తక్కువలో తక్కువ రెండేళ్ల పాటు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించటం ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా చేస్తారు. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెలకే విమర్శలకు దిగితే ప్రజల్లో ఛీత్కారం పెరుగుతుందన్న విషయాన్ని బాబు మర్చిపోయారు. అంతేకాదు.. ఓటమి ప్రజల్లో సానుభూతిని పెంచాల్సిన దానికి భిన్నంగా తన మీద.. తన పాలన మీదా ప్రజల్లో కసి నెలకొన్న వైనాన్ని ఆయన మర్చిపోయారు.

దీని వల్ల జరిగిన నష్టమేమంటే.. ప్రజలకు తానేదో చేయాలన్న తపనను బాబు ప్రదర్శిస్తే.. ఆయన తీరు అతిగా ఏపీ ప్రజలు ఫీలయ్యే పరిస్థితి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్నోఇన్నో సీట్లు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో.. కేడర్ ను చైతన్యపరిచేందుకు బాబు కిందామీదా పడుతున్నారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణం తనకు అనుకూలంగా లేదన్నవిషయాన్ని బాబు మర్చిపోతున్నారు.

ఇదే.. బాబు చేత వరుస తప్పుల్ని చేయిస్తోంది. అయితే.. తాను తీసుకునే నిర్ణయాలకు చెక్ పెట్టే విషయంలో జగన్ తనకంటే ముందుంటారన్న విషయాన్ని బాబు మిస్ అవుతున్నారని చెప్పాలి. ఈ విషయం తాజాగా ఆయన నిర్వహించిన దీక్ష సందర్భంగా మరోసారి నిరూపితమైంది. ప్రభుత్వం ఏర్పాటైన నాలుగు నెలల వ్యవధికే ఇసుక కొరతపై పెద్ద ఎత్తున దీక్షను నిర్వహించటం ద్వారా.. ఏపీ ప్రజల్లో తనపై మైలేజీ పెరిగేలా చేస్తుందని బాబు భావించారు.

కానీ.. ఆయన ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం బెజవాడలో ఆయన దీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయటం.. మరో నేత దేవినేని అవినాష్ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇలా వరుస పెట్టి షాకులు తగిలేలా చేయటంలో జగన్ అండ్ కో సక్సెస్ అయ్యారు.

ఇసుక కొరతను తెర మీదకు తీసుకురావటం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెర మీదకు తెచ్చినట్లు అవుతుందన్న బాబు ప్లానింగ్ కు రివర్స్ గేర్ లో.. తనకే షాకిచ్చేలా ప్లాన్ చేసిన వైనంతో వారంతా అవాక్కు అయిన పరిస్థితి. దీంతో.. బాబు చేస్తున్న ఇసుక దీక్ష కవరేజ్ కంటే ఎక్కువగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వంశీ.. దేవినేని అవినాష్ లపైనే మీడియా ఫోకస్ పెట్టింది.

ఇసుకపై దీక్ష చేస్తున్నట్లు బాబు ప్రకటించినంతనే రివర్స్ లో ఏం చేయాలన్న దానికి సంబంధించి జగన్ పక్కాగా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవగాహన లేని బాబు అండ్ కో ఇసుక దీక్షతో వచ్చే మైలేజీ మీద భారీగా కలలు కన్నారు. తాము అనుకున్నట్లుగా టన్నుల కొద్దీ మైలేజీ రాకపోగా.. భారీగా డ్యామేజ్ జరిగిందన్న వైనం అర్థమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. బాబు మదర్ బోర్డును పూర్తిగా మార్చటం ఇప్పుడు చాలా అవసరం. లేదంటే.. ఇప్పుడు ఎదురైన డ్యామేజీలు మరిన్ని తప్పవని చెప్పక తప్పదు.
Tags:    

Similar News