118 పేజీలు : అడిగిన వివరాలు అందులో లేవ్!

Update: 2018-02-17 13:19 GMT
‘ఆ అరుణాచలం శాసిస్తాడు.. ఈ అరుణాచలం పాటిస్తాడు..’

ఈ పంచ్ డైలాగు మాదిరిగానే జరుగుతోంది రాజకీయం కూడా...

‘పవన్ కల్యాణ్ అర్థించాడు. చంద్రబాబు పంపించాడు’

‘‘పవన్ కల్యాణ్ అడిగిన అన్ని వివరాలూ వెబ్ సైట్ లోనే ఉన్నాయి.. మళ్లీ ప్రత్యేకంగా ఇచ్చే పనేం లేదు’’ అని తొలుత అనేశారు గానీ.. అందువలన తమ మైలేజీ ఏమైనా దెబ్బతింటుందని తర్వాత ఆలోచన కలిగినట్లుంది. ఎటూ పవన్ మనవాడే అని క్లారిటీ ఉన్నది గనుక.. ఆయనకు సహకరిస్తే తప్పేముంది అని కూడా అనిపించినట్లుంది. అందుకే కాబోలు.. ముఖ్యమంత్రి చంద్రబునాయుడు ఒకవైపు బహిరంగసభలో లెక్కలు అడగటం సరైన పద్ధతి కాదు - ఏ లెక్కలైనా అసెంబ్లీలోనే చెబుతాం అని ప్రకటించిన చంద్రబాబు మరోవైపు జెఎఫ్‌ సి అడిగిన వివరాలు అందిస్తూ వారికి సహకరించడానికి ఇద్దరు ఐఎఎస్ అధికార్లను నియమించారు. అలాగే పవన్ కోసం 118 పేజీలు నోట్ ను తయారుచేసి.. ఒక ప్రత్యేక మెసెంజర్ ద్వారా.. పవన్ సన్నిధికి పంపించారు.

అయితే ఇక్కడో తమాషా బయట పడుతోంది. వివరాలు అడిగినందుకు గాను.. రాష్ట్రప్రభుత్వం స్పందించి.. 118 పేజీల నివేదికను పంపించింది. అయితే అందులో పవన్ గానీ - కమిటీ సభ్యులుగానీ అడిగిన వివరాలు మాత్రం లేవు. నివేదిక అందిన తరువాత.. బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి.. అందులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి హామీలు ఇచ్చింది. ఏయే సందర్భాల్లో ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఏమేం రావాల్సి ఉంది. ఏ రకంగా జాప్యం జరుగుతోంది... వంటి వివరాలు మాత్రమే అందులో చాలా విపులంగా ఉన్నాయిట.

అయితే కేంద్రంనుంచి వచ్చిన నిధులను ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది. ఎంతెంత నిధులు వచ్చాయి.. ఏయే పద్దుల కింద వచ్చాయి.. వాటి వినిమయం (ఖర్చు) ఎలా జరిగింది. ఏయే పద్దుల కింద ఆ సొమ్మును ఖర్చు చేయడం జరిగింది అనే వివరాలు మాత్రం ఆ నోట్ లో లేవు.

నిజానికి కమిటీ ఆశించిన వివరాలు అవే. అటు కేంద్రం నుంచి ఏయే పద్దుల కింద ఎంతెంత ఇచ్చారో వారు చెప్పాలి.. ఇటు రాష్ట్రం నుంచి ఏయే పద్దుల కింద ఎంత అందిందో.. ఎలా ఖర్చు అయిందో రాష్ట్రప్రభుత్వం చెప్పాలి అని కమిటీగానీ, పవన్ గాని అడిగారు. అలాంటి వివరాలు రావడం వల్ల.. రెండు ప్రభుత్వాల్లో అబద్ధం చెబుతున్నది ఎవరో తేలిపోతుందని వారు ఆశించారు. అయితే.. రాష్ట్రప్రభుత్వం నెపం తమ మీద లేకుండా నివేదిక పంపేసిందే గానీ.. అందులో కమిటీ బేరీజు వేయడానికి అవసరమైన అసలు వివరాలు మాత్రం లేవని తెలుస్తోంది.

Tags:    

Similar News