ఆ ఇష్యూలో బాబు ఇక యమా సీరియస్ అంట

Update: 2016-06-12 09:52 GMT
గడిచిన రెండేళ్లలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏ విషయానికీ సీరియస్ కాని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఇట్టే సీరియస్ అవుతున్నారు. వీలైనంతవరకూ సర్దుకుపోయే తత్వానికి భిన్నంగా ముక్కుసూటిగా తాను చెప్పాల్సింది చెప్పేస్తున్న ఆయన.. సర్కారీ మాటను వినకపోతే చర్యలు సైతం తప్పవంటూ తేల్చేయటం గమనార్హం. ఈ నెల 27నాటికి ఏపీ సచివాలయ ఉద్యోగులు తాత్కాలిక సచివాలయానికి వచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వదిలేసి.. ఏపీకి వెళ్లే ఉద్యోగులు తమకు మరికొంత టైం ఇవ్వాలని.. ఆ తర్వాత తాము అమరావతికి వెళతామంటూ బేరాలు ఆడుతుంటే.. బాబు మాత్రం ససేమిరా అంటున్నారు.

ఈ ఇష్యూలో భాగంగా ఆ మధ్యన మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిని ఏపీ సచివాలయ ఉద్యోగులు కలవటం బాబుకు అస్సలు నచ్చలేదు. సమస్యను తన దృష్టికి తేవాల్సింది పోయి.. పురంధేశ్వరిని కలవటం ఏమిటని బాబు తెగ ఫీలైపోయారు. ఆ విషయాన్ని మనసులో ఉంచుకోని ఆయన మొహమాటం లేకుండా బయటకే చెప్పేశారు. తమ సమస్యల్ని పురంధేశ్వరితో పంచుకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేతల్లో చూపిస్తున్న ఆయన.. ఏది ఏమైనా ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ విడిచి రావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అమరావతికి వచ్చే విషయం మీద ఏదైనా సమస్య ఉంటే తమ హెడ్స్ తో మాట్లాడుకోవాలే తప్పించి.. మరొకరికి ఈ విషయం మీద చర్చించాల్సిన అవసరం లేదంటున్నారు. అమరావతికి షిఫ్ట్ అయ్యే విషయంలో మరో మాటకు తావు లేదని స్పష్టం చేస్తున్నారు.

అమరావతికి ఏపీ ఉద్యోగులు తరలి రావటంపై మరో వాదనకు అవకాశం లేదని.. ఒకవేళ ఎవరైనా అలాంటి పని చేస్తే వారి విషయంలో తాను కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. తమ సమస్యల్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పకుండా.. మీడియాకు.. ఇతర రాజకీయ నాయకులతో పంచుకుంటే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయని.. అలాంటి వారిని తాను ఊరికే వదిలిపెట్టనని స్పష్టం చేయటం గమనార్హం.

అమరావతికి వచ్చే విషయం మీద మరెలాంటి మాటలు లేవని.. ఎవరైనా మొండికేసి ప్రెస్ కి వెళ్లినా.. ఇతర నేతల వద్దకు వెళ్లినా తాను ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటానని చెబుతున్న చంద్రబాబు.. చర్యలు పక్కా అంటున్నారు. మొన్నటివరకూ ఉద్యోగుల తీరు పట్ల అపరిచితుడిలో‘రామానుజం’’గా వ్యవహరించిన బాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం. బాబు టోన్ లో వచ్చిన తేడాను ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇప్పటికైనా గుర్తిస్తారో? లేదో..?
Tags:    

Similar News