చినబాబు లెక్క పై చంద్రబాబు ఏం చెప్పారంటే..?

Update: 2015-10-01 04:05 GMT
మూడు.. నాలుగు రోజుల క్రితం తమ కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తుల గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ వివరాలు వెల్లడించటం తెలిసిందే. చినబాబు ఆస్తుల లెక్కలపై చాలానే వ్యాఖ్యలు వినిపించాయి. ఏపీ విపక్ష నేతలైతే.. చంద్రబాబు జూబ్లీహిల్స్ ఇంటి విలువ రూ.32 కోట్లు అయితే లోకేశ్ లెక్క ప్రకారం రూ.23.2లక్షలేనంటూ నేరుగానే విమర్శించారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేరు మీదున్న మదీనాగూడలోని 5ఎకరాల భూమిని లోకేశ్ లెక్కలో రూ.73.8లక్షలు చెప్పగా.. దాని అసలు విలువ రూ.125కోట్లుగా లెక్క చెప్పటం తెలిసిందే. ఇలా లోకేశ్ చెప్పిన లెక్కకు.. మార్కెట్లో వినిపించే ఆస్తుల విలువకు సంబంధం లేదన్న విమర్శలు భారీగా వినిపించటంతో ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు.

ప్రభుత్వ విలువను అనుసరించే ఆస్తులను లెక్కిస్తారని.. తమ కుటుంబ సభ్యులు కష్టపడి పని చేస్తుంటే వారి మీదా ఆరోపణలు చేయటం ఏమిటంటూ మండిపడ్డారు. ప్రతి ఏటా తమ ఆస్తుల వివరాల్ని సీల్డ్ కవర్ లో అసెంబ్లీకి ఇస్తున్నామంటూ చెప్పిన ఆయన.. అసలు తన జేబులో డబ్బులే ఉండవని.. చేతికి వాచీ.. ఉంగరాలు కూడా పెట్టుకోనని చెబుతూ.. అలాంటిది తన ఆస్తులపై బురద జల్లటమేమిటంటూ అసంతృఫ్తి వ్యక్తం చేశారు.

తన కుమారుడు లోకేశ్ వెల్లడించిన ఆస్తుల లెక్క కచ్ఛితంగా ఉందన్న విషయాన్ని చెబుతూనే.. తామ వెల్లడించిన విలువలన్నీ ప్రభుత్వ లెక్కల ప్రకారమన్న నిజాన్ని చెప్పేశారు. మరి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆయా ఆస్తుల విలువ చినబాబు ప్రకటించిన దానికి సరిపోయేలా ఉంటాయా లేదా అన్నది చూడాలని..అలా ఉంటే ఇక తప్పు పట్టాల్సిందేముందంటూ ఏపీ అధికారపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. తమ ఆస్తుల లెక్కపై చంద్రబాబు చెప్పిన దాన్లోనూ న్యాయం ఉంది కదా.
Tags:    

Similar News