జ‌గ‌న్‌ పై దాడి..టీడీపీ సెల్ఫ్‌ గోల్ చేసుకున్న‌ట్లేగా!

Update: 2018-10-26 07:11 GMT
ప్రతిపక్షపార్టీ నేత వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్ బయల్దేరేముందు విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌ లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనపై ఎయిర్‌ పోర్ట్ రెస్టారెంట్‌ లో పనిచేస్తున్న వెయిటర్ కత్తితో పొడవడంతో జగన్ ఎడమ భుజానికి గాయమయింది. దాడికి పాల్పడిన వ్యక్తి పనిచేస్తున్న రెస్టారెంట్ టీడీపీ నాయకుడిది కావడంతో ఈ ఘటన ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. వైఎస్ జగన్‌ పై వైజాగ్ దాడి ఘటనపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. సీఐఎస్ ఎఫ్ సహా అన్ని సంస్థలను ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు ట్విట్టర్‌ లో వెల్లడించారు. దాడి ఘటనపై వెంటనే నివేదిక అందజేయాలని ఏపీ - తెలంగాణ రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ - ఏపీ డీజీపీ ఠాకూర్‌ ను ఆదేశించారు.

కాగా, ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ఈ ఎపిసోడ్‌ పై చిత్ర‌మైన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి పలు అనుమానాలకు తావిస్తోందని - ఇదంతా కేంద్రం పన్నిన కుట్రలో భాగమేనని ఆయ‌న పేర్కొన్నారు. ప్రతిపక్షనేత పై జరిగిన ప్రదేశం కేంద్రప్రభుత్వ పరిధిలో ఉందని, దాడి జరిగిన అనంతరం బాధ్యతగా ప్రవర్తించాల్సిన వ్యక్తులు నేరుగా హైదరాబాద్‌ వెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించుకోవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడ నుండి ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి - అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లిపోవడం అంతా ఒక డ్రామాలా ఉందని ఆయన విమర్శించారు. జగన్‌ పై దాడిలో కుట్రకోణం దాగి ఉన్నదని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. జగన్‌ పై దాడిచేసింది ఆయన అభిమానే అని టీడీపీ నేతలు - పోలీసులు చెప్పడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ లో ఖండించారు. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందని పోలీసులు - ఎయిర్‌ పోర్టులో జరిగింది కాబట్టి అది పోలీసుల బాధ్యత కాదంటూ టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఘటనపై విచారణ చేయకముందే ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు విచారణను నీరుగార్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. జగన్‌ పై దాడి దుర్మార్గపు చర్య అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు.

అధికార‌ - ప్ర‌తిప‌క్ష అభిప్రాయాల నేప‌థ్యంలో స‌హ‌జంగానే ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం తెర‌మీద‌కు వ‌స్తుంది. ఎయిర్‌ పోర్ట్‌ లోని భ‌ద్ర‌త త‌మ ప‌రిధిలో లేదంటున్న ఏపీ స‌ర్కారు గ‌తంలో అదే ఎయిర్‌ పోర్ట్‌ లోకి వెళ్లి వైఎస్ జ‌గ‌న్‌ ను ఎలా అరెస్ట్ చేశార‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌త్యేక హోదా గ‌ళం వినిపించేందుకు జ‌గ‌న్ వెళ్ల‌గా విమానాశ్ర‌యంలోనే విప‌క్ష‌నేత‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశార‌ని గుర్తు చేస్తున్నారు. ఆనాడు లేని ప‌రిధి - ఇత‌ర‌త్రా అంశాలు నేడు ఎలా ముందుకు వ‌చ్చాయో చెప్పాల‌ని అంటున్నారు. భ‌ద్ర‌తాప‌రంగా తీవ్ర‌మైన లోపం త‌మ‌ద‌ని ఒప్పుకోలేని టీడీపీ నేత‌లు, ఏపీ స‌ర్కారు....ఆ అంశ‌మే త‌మ‌కు సంబంధం లేనిద‌ని త‌ప్పించుకోవ‌డం చూస్తుంటే...అవ‌కాశ‌వాద‌ - ఉద్దేశ‌పూర్వ‌క తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News