కరోనా వేళ కామ్ గా ఉండలేరా చంద్రబాబు?

Update: 2020-04-08 00:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు మళ్లీ తన నోటికి పని చెప్పారు. తాజాగా ఏపీ సర్కారుపై విమర్శలు సంధించారు. ప్రత్యేక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న వేళ.. విపక్షాలన్ని మౌనంగా ఉంటూ అధికార పార్టీని ఉద్దేశించి విమర్శలు చేయటం దాదాపుగా తగ్గించేశారు. ఒకట్రెండు వ్యాఖ్యలు చేసినా.. అవన్నీ కూడా సూచనలతో కూడుకున్నవే తప్పించి.. ఘాటైన విమర్శలు కావు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. ఏపీ ప్రభుత్వాన్ని వంకలు పెట్టేందుకు అవకాశంగా మలుచుకున్నారని చెప్పక తప్పదు.

ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తున్న బులిటెన్లలో ఎన్ని పరీక్షలు చేస్తున్నారన్న విషయాన్ని చెప్పకుండా దాచేస్తున్నారని చెప్పిన ఆయన.. కేరళలో ఇప్పటివరకూ పదివేల పరీక్షలు చేశారని.. ఏపీలో ఎంతమందికి చేశారో ఎందుకు చెప్పటం లేదంటూ తప్పు పట్టారు. గడిచిన వారంలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా వెయ్యి శాతం పెరిగినట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రస్తావిస్తున్న గణాంకాలు.. చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. కరోనా వేళలోనూ రాజకీయాలు అవసరమా బాబు? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు. ఎందుకంటే.. మర్కజ్ ఎపిసోడ్ తెర మీదకు రాక ముందు వరకూ కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏపీ పరిస్థితి బాగానే ఉందన్నది మర్చిపోకూడదు. ఊహించని ఉత్పాతంలా మారిన మర్కజ్ ఎపిసోడ్ తో దేశంలోని పలు రాష్ట్రాలు కిందామీదా పడుతున్నాయి. అందులో ఏపీ ఒకటన్నది మర్చిపోకూడదు. ఇలాంటివేళ.. సంయమనం తో వ్యవహరించాలే కానీ.. చిల్లర వ్యాఖ్యలు చేయకూడదు.

ఏపీలో పాజిటివ్ కేసులో వారంలో వెయ్యి శాతం పెరిగినట్లుగా బాబు చెప్పే గణాంకాల్లో వాస్తవమే ఉండొచ్చు. కానీ.. దాని వెనుకున్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఏపీలో అతి తక్కువ కేసులు నమోదైనప్పుడు.. మర్కజ్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా కేసులు పెరిగినప్పుడు.. తక్కువ కేసుల నుంచి ఎక్కువ కేసులు చేరినప్పుడు శాతాల్లో చూస్తే ఒళ్లు జలదరింపునకు గురవుతుంది.

ఉదాహరణకు ఐదు కేసులు కాస్తా.. ఒక్కసారిగా పాతిక కేసులు నమోదైయ్యాయనే అనుకుందాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. పాతిక కేసులు పెద్ద విషయంకాదు. కానీ.. ఐదు కేసుల నుంచి పాతిక కేసుల్ని శాతాల్లో చూసినప్పుడు వచ్చే విలువ భారీగా కనిపిస్తుంది. అంకెలు చేసే మాయాజాలాన్ని వాడుకోవటం తప్పేం కాదు. కానీ.. దానికి సమయం సందర్భం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని వదిలేసి.. ఏదో రీతిలో ఏపీ సర్కారును బద్నాం చేయాలన్న చంద్రబాబు తీరు సరికాదు. సంక్షోభం వేళ.. ఎంతో అవసరమైతే తప్పించి రాజకీయ విమర్శలు  చేయకూడదు. ఒకవేళ.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలనుకుంటే సూచనలు చేయాలే తప్పించి అదే పనిగా నోరు పారేసుకోకూడదన్నది మర్చిపోకూడదు. మరీ విషయాలన్ని బాబుకు ఎందుకు అర్థం కానట్లు..?
Tags:    

Similar News