సింగపూర్ భజనలో తరిస్తున్న చంద్రబాబు!

Update: 2017-11-09 17:30 GMT
ఇల్లు తగలబడుతోందిరా మగడా.. అంటే చుట్టకు నిప్పట్టుకు రమ్మన్నాడట వెనకటికి ఓ పెద్దమనిషి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న సరళి అందుకు ఎంతమాత్రమూ భిన్నంగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అచేతనత్వాన్ని దెప్పి పొడుస్తూ, ప్రభుత్వం ఎంత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా.. చట్టాల్ని తుంగలో తొక్కేస్తూ రాజ్యం చేస్తున్నదో  ప్రజలకు తెలియజెప్పడానికి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ సభకు వెళ్లకుండా కట్టడి చేస్తే.. అటు వైపు నుంచి చంద్రబాబునాయుడు మాత్రం.. తనకేదో మహదవకాశం దక్కినట్లుగా పొంగిపోతున్నట్లు కనిపిస్తోందని ప్రజలు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన వ్యవహారంలోనూ ఆయన సింగపూర్ భజన చేసుకుంటూ తరించడాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు.

సచివాలయంలో పార్టీ నాయకుల సమావేశం పెట్టుకున్న చంద్రబాబునాయుడు.. శుక్రవారం ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు వైకాపా గైర్హాజరు కావడం గురించి చర్చించారు. వారు రాకపోయినా పర్లేదనే కామెంట్లు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వారు రాకపోతున్నందుకు కారణాలు తెలిసినా, వాటి గురించి మాట్లాడకుండా, ఆ లోపాలను దిద్దకుండా, విపక్షం వచ్చే ప్రజాస్వామిక పరిస్థితిని కల్పించకుండా.. డొంకతిరుగుడు వ్యవహారం నడుపుతున్న చంద్రబాబునాయుడు.. సింగపూర్ లో కూడా ప్రతిపక్షం నామమాత్రంగానే ఉంటుందని.. పాలక పక్షమే ప్రజల సమస్యలను కూడా సభలో ప్రస్తావిస్తుందని సెలవిచ్చారట.

సింగపూర్ తో కొన్ని దశాబ్దాలుగా ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉండే ఆయన.. అమరావతి  పనుల ప్రారంభం సమయంలో సింగపూర్ పాటలే పాడారు. అక్కడి వారి ట్యూన్లకు అనుగుణంగానే.. ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. అయితే ఆ టెక్నిక్కులు ఏవీ వర్కవుట్ కాలేదు. సింగపూర్ నుంచి నయాపైసా రాలేదు. ఆ తర్వాత ఒక్కో దేశమూ తిరుగుతూ.. ఒక్కో ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆయనలో ఇప్పటికీ.. సింగపూర్ ప్రేమ వాడిపోయినట్లు లేదు. అందుకే విపక్షం రాకుండా ఉంటున్న పరిస్థితిని కూడా సింగపూర్ తో పోలుస్తూ తన పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారంటే.. ఆయన ఎంతటి తెగింపుతో ఉన్నారో అర్థం అవుతుంది.
Tags:    

Similar News