అనంతలో టీడీపీ సీట్లు వీరికేనట..

Update: 2019-03-07 08:18 GMT
అనంతపురం అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. మొత్తం జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఖరారు కాగా.. 5 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. అమరావతిలో బుధవారం రాత్రంతా సాగిన సమీక్షలో చంద్రబాబు సర్వేలు - లెక్కలు - సమీకరణాలు అన్నీ క్రోడీకరించి సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించారు.

ఇక జేసీ ఫ్యామిలీ వారసులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నుంచి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి బరిలోకి దిగుతాడని బాబును కోరగా సమ్మతించారు. ఇక అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తప్పుకొని ఆయన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదించగా బాబు సరేనన్నారు.

అనంతపురం జిల్లాలో బావమరిది బాలయ్యకు హిందూపురం ఎమ్మెల్యే సీటును మరోసారి చంద్రబాబు కట్టబెట్టారు. ఇక రాప్తాడులో మంత్రి పరిటాల సునీత - రాయదుర్గంలో మంత్రి కాలువ శ్రీనివాసులు మళ్లీ బరిలోకి దిగనున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి - ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ - ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ - అనంతపురం నుంచి వైకుంఠ ప్రభాకర చౌదరి - మడకశిర నుంచి ఈరన్నలకు చంద్రబాబు సీట్లను ఖరారు చేశారు.

ఇక కళ్యాణదుర్గం - పుట్టపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపుపై వ్యతిరేక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక శింగనమల - కదిరి - గుంతకల్లు నియోజకవర్గాల అసమ్మతి, పోటీ ఎక్కువగా ఉండడంతో వాటిని పెండింగ్ లో పెట్టారు.

అనంతపురం నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకిస్తూ జేసీ దివాకర్ రెడ్డి వర్గం బాయ్ కాట్ చేసి వెళ్లిపోయింది. అయినా బాబు ప్రభాకర్ చౌదరికే టికెట్ కేటాయించారు.

ఇక హిందూపురం ఎంపీ టికెట్ పై చంద్రబాబు ఎటూ తేల్చలేదు. హిందూపురం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని దింపాలని చంద్రబాబుకు జిల్లా నేతలు ప్రతిపాదించారు. ఆయనే బలమైన అభ్యర్థి అని కోరారు. హిందూపురం టీడీపీ సిట్టింగ్ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఉద్దేశంతో ఉండడంతో ఈ మార్పు కనిపిస్తోంది. పుట్టపర్తిని కేటాయించాలని కిష్టప్ప కోరుతున్నారు.

ఇక పరిటాల సునీత కుమారుడు శ్రీరాం కూడా ఈసారి హిందూపురం ఎంపీ సీటుకానీ.. లేదా ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. కానీ ఒకే కుటుంబానికి ఒకే సీటుతో ఆయనకు అవకాశం దక్కకపోవచ్చంటున్నారు.
Tags:    

Similar News