వెంకయ్య‌పై ఫ‌స్ట్ పంచ్ వేసింది బాబే!

Update: 2017-07-18 10:51 GMT
నిన్న‌టిదాకా బీజేపీ సీనియ‌ర్ నేత‌గా, న‌రేంద్ర మోదీ కేబినెట్‌లో కీల‌క శాఖ మంత్రిగా వ్య‌వ‌హరించిన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు... ఇప్పుడు పార్టీక‌తీతుడిగా మారిపోయారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట‌మి అభ్య‌ర్థిగా వెంక‌య్య‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే... కేంద్ర మంత్రి ప‌ద‌వితో పాటు బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన వెంక‌య్య‌... ఇక‌పై తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాద‌ని ప్ర‌క‌టించారు. ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా వెంక‌య్య పేరును బీజేపీ అధిష్ఠానం ప్ర‌క‌టించ‌గానే... ఫోనందుకున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నేరుగా వెంక‌య్య‌కు ఫోన్ చేశారు. రాజ్యాంగ ప‌ద‌వికి ఎన్నిక‌వుతున్నందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. ఇప్ప‌టిదాకా క్రియాశీల రాజ‌కీయ‌వేత్త‌గా రాణించిన మీరు... రాజ్యాంగ ప‌దవిలోనూ రాణించాల‌ని ఆశిస్తున్న‌ట్లు కూడా చంద్ర‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. వెంక‌య్య‌తో ఫోన్ సంభాష‌ణ ముగియ‌గానే నేరుగా మీడియా స‌మావేశానికి వ‌చ్చిన చంద్ర‌బాబు... వెంక‌య్య‌పై పంచ్ వేశారు.

ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపికైన వెంకయ్య‌పై తొలి పంచ్ విసిరిన వారిలో చంద్ర‌బాబే మొదటివార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా వెంక‌య్య‌పై పంచ్ విసిరిన చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... *గ‌ల‌గ‌లా రాజ‌కీయాలు మాట్లాడే వెంకయ్య‌నాయుడికి ఉప‌రాష్ట్రప‌తిగా రాజ‌కీయాలు మాట్లాడ‌కుండా ఉండ‌టం పెద్ద ప‌రీక్షే. వెంకయ్య జీవితం మొత్తం రాజ‌కీయ‌మే. దానితో ఇప్ప‌టికిప్పుడు తెగ‌దెంపులు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మే. అయితే ఆ ప‌రీక్ష‌లో వెంక‌య్య పాస‌వుతార‌ని భావిస్తున్నా* అని చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రప‌తి ప‌దవికి వెంక‌య్య‌ను ఎంపిక చేస్తార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన సంద‌ర్భంలో వాటిని కొట్టిపారేసిన వెంక‌య్య‌.. త‌న భార్య ఉషా పేరును ప్ర‌స్తావిస్తూ ఉషాప‌తిగా ఉండ‌టానికే తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, రాష్ట్రప‌తిగా తాను వెళ్ల‌బోన‌ని చెప్పుకొచ్చారు. నిన్న బీజేపీ పార్ల‌మెంటరీ పార్టీ భేటీలోనూ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా త‌న‌ను ఎంపిక చేస్తూ మోదీ ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలోనూ వెంక‌య్య  త‌న అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయి.

ఇంకా క్రియాశీల రాజ‌కీయాల్లోనే కొన‌సాగాల‌నుకుంటున్నాన‌ని, ఇప్పుడు ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి త‌న‌కెందుక‌ని కూడా ఆయ‌న త‌న వాద‌న‌ను వినిపించార‌ట‌. పార్టీకి త‌న సేవ‌లు అవ‌స‌ర‌మ‌ని, పార్టీకి సేవ చేసేందుకే తాను ఇష్ట‌ప‌డుతున్నాన‌ని కూడా వెంక‌య్య చెప్పినా... మోదీ విన‌లేద‌ట‌. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాల‌ను తూచా త‌ప్ప‌కుండా పాటించే ల‌క్ష‌ణ‌మున్న వెంక‌య్య‌.. మోదీ ప్ర‌తిపాద‌న‌ను కాద‌న‌లేక ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు స‌రేన‌న్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా వెంక‌య్య త‌ర‌హాలోనే ఆలోచించి ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ... ఉప‌రాష్ట్రప‌తిగా రాజ‌కీయాలు మాట్లాడ‌కుండా వెంక‌య్య ఉండ‌టం క‌ష్ట‌మేన‌ని ప్ర‌క‌టించడం ద్వారా చంద్ర‌బాబు... వెంక‌య్య‌పై పంచ్ విసిరిన‌ట్లుగానే భావించాల్సి వ‌స్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News