వెంకయ్యను తిడితే బాబుకు బాధే!

Update: 2016-09-20 04:30 GMT
‘‘చెంపకు చేయి పరమైనప్పుడు కంటికి నీరు ఆదేశమగును’’ అన్న మాటను చిన్నప్పుడే నేర్చుకుంటారందరు. తనకు.. కేంద్రమంత్రి వెంకయ్యకు మధ్యనున్నఅనుబంధాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తాను ఏపీ నుంచి ఎన్నిక కాకున్నా.. ఏపీ వాడిగా.. ఏపీకి ఏదోచేయాలన్న తపనతో ఎంతో చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి వెంకయ్య పదే పదే చెప్పటం కనిపిస్తుంది. కన్నతల్లి రుణం తీర్చుకునే విషయాన్ని గొప్పగా చెప్పుకోవటం వెంకయ్యకు చేతనైనంత బాగా మరెవరికీ సాధ్యం కాదేమో?

సొంత ప్రాంతాన్ని తనదైన శైలిలో విమర్శలు ఎక్కు పెడుతూనే.. తనకు తన మాతృభూమి ఏమీ చేయకున్నా.. తాను సొంతంగా ఎదిగి.. పుట్టిన ప్రాంతానికి చాలా చేస్తున్నట్లుగా ఈ మధ్యన వెంకయ్య తరచూ చెప్పటం కనిపిస్తోంది.విభజన సమయంలో హోదా మాటను తెర మీదకు తీసుకొచ్చిన వెంకయ్య..ఇప్పుడు హోదా ఇచ్చే అవకాశం లేనందున వదిలేయాలన్న విషయాన్ని చెప్పటంగమనార్హం.

తనకు తోచినట్లుగా హోదా విషయాన్ని తీసుకురావటం.. మర్చిపొమ్మని చెప్పటం వెంకయ్యకు మాత్రమే చెల్లుతుందేమో. విభజన సమయంలో ఏపీకి హోదా అనినినదించిన ఆయన.. తాజాగా మారిన వెంకయ్య టోన్ కు తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న హోదా మీద పోరాటం చేస్తూనే.. కేంద్రం ఇచ్చే వాటిని తీసుకుంటానని చెప్పిన బాబు..తాజాగా మాత్రం అలాంటిదేమీ లేదన్న విషయాన్ని చెప్పేయటం తెలిసిందే. హోదా మీద రాజీ పడిన బాబు.. తనకు ప్రాణ స్నేహితుడైన వెంకయ్యనాయుడ్ని సైతం వెనకేసుకొచ్చే ప్రోగ్రాం ఒకటి తాజాగా షురూ చేశారు. సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా వెంకయ్య మీద పాజిటివ్ ఫీల్ కలిగేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తాను రాజ్యసభకు ఏపీ నుంచి ఎంపిక కాలేదని.. తానిప్పటి వరకూ కర్ణాటక నుంచి మాత్రమే ఎన్నికయ్యానని.. ఈసారి మాత్రం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యానని.. అయినప్పటకీ పుట్టిన ప్రాంతమన్న ఉద్దేశంతో ఏపీకి ఎంతో చేస్తున్నట్లుగా వెంకయ్య చెబుతుంటారు. సరిగ్గా ఆయన చెప్పిన రీతిలోనే చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. ‘‘వెంకయ్య రెండుసార్లు కర్ణాటక.. ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాలన్న తపన పడుతున్నారు. ఆయన్ను విమర్శిస్తే ఏంవస్తుంది?’’ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు.

ఏపీకి ఎంతో చేస్తున్న వెంకయ్యను ఏం అనకూడదని.. ఆయన్ను విమర్శిస్తే పాపం కలుగుతుందన్న రీతిలో బాబు వ్యాఖ్యానించటం గమనార్హం. సో.. ఇకపై వెంకయ్యను విమర్శించే వారంతా.. తాము విమర్శిస్తే వెంకయ్యను మాత్రమేకాదు.. చంద్రబాబును కూడా చిన్నబుచ్చినట్లే అవుతుందన్న విషయాన్ని బాబు తనమాటలతో స్పష్టం చేసేశారు. సో.. ఇక వెంకయ్య పై ఈగ వాలకుండా బాబు చూసుకుంటారన్న మాట.
Tags:    

Similar News