ఏకాంతంగా గవర్నర్ కు బాబు చెప్పింది ఇదేనా?

Update: 2016-11-05 08:29 GMT
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఇద్దరు చంద్రుళ్లు ఇద్దరూ గవర్నర్ నరసింహన్ విషయంలో ఒకే తీరులో వ్యవహరించారన్న విషయం తెలిసిందే. ఆయన్ను పెద్ద మనిషిగా చూసుకుంటూ తరచూ ఆయనతో భేటీ అవుతుండేవారు. తాము తీసుకున్న నిర్ణయాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లటంతో పాటు.. ఆయన ఫీడ్ బ్యాక్ కోరేవారని చెబుతారు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండి అధికారాన్ని మరోసారి చేజిక్కించుకున్న నేపథ్యంలో బాబు ఆచితూచి అడుగులు వేసేవారు. అందుకే ఆయన.. గవర్నర్ ను తరచూ సంప్రదింపులు జరిపే వారని చెప్పాలి.

దీనికి తోడు విభజన చికాకుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలకు పెద్దమనిషిగా గవర్నర్ అనివార్యం కావటం.. నరసింహన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమితంగా ప్రాధాన్యత ఇవ్వటం లాంటి అంశాలు కూడా బాబు మీద ప్రభావం చూపాయని చెప్పొచ్చు. దీంతో.. ప్రతి విషయాన్ని ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేవారు.

ఇక.. రెండురాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు ఇద్దరు చంద్రుళ్లకు గవర్నర్ మరింత సన్నిహితం అయ్యారని చెప్పాలి. అయితే.. తమ పాలనను హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ చేసిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను తరచూ కలిసే అవకాశం చంద్రబాబుకు లేకుండా పోయింది. వీలైనంత తక్కువగా హైదరాబాద్ కు వెళ్లాలన్న చంద్రబాబు ఆలోచన కూడా గవర్నర్ తో భేటీలు లేకుండా చేసింది. బాబు విషయంలో ఇలా ఉంటే.. కేసీఆర్ మాత్రం ఎప్పటి మాదిరే గవర్నర్ నరసింహన్ ను తరచూ కలిసి చర్చలు జరపటం చూస్తున్నదే.

హైదరాబాద్ కు తక్కువగా రావాలన్న నియమం పెట్టుకున్న బాబు తీరుతో.. కొన్ని సందర్బాల్లో గవర్నరే స్వయంగా విజయవాడకు వెళ్లటం కనిపిస్తుంది. ఆ మధ్యన తెలంగాణ సర్కారుకు అవసరమైన ఏపీ సచివాలయ భవనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేందుకు గవర్నర్ విజయవాడ వెళ్లటాన్ని మర్చిపోలేం. అధికారికంగా వేరే కార్యక్రమం కోసం ఆయన వెళ్లినప్పటికీ.. బాబుతో జరిపిన భేటీలో మాత్రం ఈ అంశాన్నే ఆయన ప్రముఖంగా ప్రస్తావించటాన్ని మర్చిపోకూడదు.

తాజాగా గవర్నర్ బర్త్ డే సందర్భంగా రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు.. కేక్ కట్ చేసి స్వయంగా గవర్నర్ నోట్లో పెట్టిన  నరసింహన్ తనకెంత ఆప్తుడన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. బర్త్ డే వేళ.. గవర్నర్ బిజీబిజీగా ఉన్నప్పటికీ చంద్రబాబుతో పది నిమిషాలు ఏకాంతంగా గడపటానికి సమయం కేటాయించటం ద్వారా.. తనకు బాబు ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.  ఒకపక్క వేడుకలు జరుగుతున్న వేళ.. నరసింహన్.. చంద్రబాబుల మధ్య జరిగిన ఏకాంత చర్చల సారాంశం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ సర్కారు కోరినట్లుగా ఏపీ సచివాలయ భవనాల్ని ఇచ్చే విషయం అంత తేలిగ్గా పూర్తి అయ్యే వ్యవహారం కాదన్న విషయాన్ని గవర్నర్ కు బాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో పంచాయితీలు ఉన్నాయని.. వాటిని ఒకేసారి టోకుగా సెట్ చేసేస్తే.. భవనాల లెక్క కూడా తేల్చేస్తామని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. తెలంగాణ సర్కారు కోరినట్లుగా తాము కానీ సచివాలయ భవనాల్ని తిరిగి ఇచ్చేస్తే.. ఏపీ ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. సచివాలయాన్ని ఖాళీగా ఉంచినట్లుగా తెలంగాణ అధికారపక్ష నేతలు చెబుతున్నారని.. అది తప్పని.. కొన్ని భవనాల్ని తాము ఉపయోగిస్తున్న విషయాన్నిమర్చిపోకూడదని బాబు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన ఏకాంత భేటీలో ఎక్కువ సమయం.. తమ అధీనంలో ఉన్న సచివాలయ భవనాల్ని తెలంగాణ సర్కారుకు అప్పగించేందుకు తమకున్నఇబ్బందుల్ని చంద్రబాబు ఏకరవు పెట్టినట్లుగా సమాచారం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News