మరీ.. ఈ చెప్పుకోవటం ఏమిటి చంద్రబాబు..?

Update: 2015-12-29 04:50 GMT
వయసు మీద పడిన ప్రభావమో.. లేక.. పరిస్థితుల ప్రభావమో కానీ.. కొన్ని సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వింటే.. ఏమిటిలా మాట్లాడుతున్నారన్న భావన కలగక మానదు. మైక్రోసాఫ్ట్ సీఈవో.. తెలుగువాడైన సత్యనాదెళ్ల లాంటి వారు.. తాను స్ఫూర్తిగా దాత (కచ్ఛితంగా కాకున్నా.. కాస్త అటూఇటూగా) అన్నట్లుగా గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేసేవారు. ఇక.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిందని తానేనని ఆయన చెప్పుకుంటారు.

ఇవన్ని నిజాలు కావని.. అబద్ధాలని చెప్పటం లేదు. ఈ విషయాలు అందరికి తెలిసినవే. హైదరాబాద్ ఐటీకి చంద్రబాబు ఎంత చేశారన్నది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిందే. ఇక.. మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన సత్యనాదెళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సత్యనాదెళ్ల.. తెలుగువాడు. హైదరాబాద్ లో పెరిగినవాడు. తన ప్రాంతంలో ఐటీ ఎలా పెరిగింది.. ఎలా వృద్ధి చెందిందన్న విషయాలు ఆయనకు తెలియని కావు.

సోమవారం సత్యనాదెళ్లతో భేటీ సందర్భంగా ఆయనతో చంద్రబాబు చెప్పిన మాటలు వింటే కాస్త ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే.. హైదరాబాద్ కు తానేం చేశానన్న విషయాన్ని  చెప్పుకున్న తీరే నిదర్శనం. తన గొప్పల గురించి బాబు చెప్పుకున్నది ఆయన మాటల్లోనే చూస్తే.. మరీ ఇంతలా చెప్పుకోవాలా అనిపించక మానదు.

‘‘హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ.. అనంతపురం జిల్లాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉంది. మీరు సహకారం అందించాలి. ఆ రోజుల్లో నేను చేతిలో ఫైళ్లు మోసుకొని తిరిగాను. హైదరాబాద్ కు రావాలంటే ఏ విమానం ఎక్కాలని ప్రశ్నించేవారు. బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ కోరినప్పుడు.. అతికష్టమ్మీద పది నిమిషాలు సమయం ఇచ్చారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చారు. దాని తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చాయి. ఇప్పుడు బిల్ గేట్స్ పాత్రను మీరు చేపట్టాలి’’
Tags:    

Similar News