బాబు క‌ల‌; మ‌రో ఐదేళ్ల‌ల్లో ఏపీ నెంబ‌ర్ వ‌న్!

Update: 2015-08-13 09:20 GMT
క‌ల‌లు క‌న‌టం త‌ప్పేం కాదు. కానీ.. క‌నే క‌ల‌లో కొద్దో గొప్పో అన్న వాస్త‌విక‌త ఉండాలి. అంతేకాదు.. ఏడారిని స‌ముద్రంగా మార్చేయ‌టం.. ఆకాశాన్ని భూమిగా మార్చేయ‌టం మాదిరి క‌ల‌ల ఎప్ప‌టికీ తీర‌వు. ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైఖ‌రి కూడా ఇదే తీరులో ఉండేది. నిన్న‌మొన్న‌టివ‌ర‌కూ కొద్దో గొప్పో ప్రాక్టిక‌ల్ గా మాట్లాడిన వ్య‌క్తి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్న‌మైన వ్యాఖ్య చేసి అంద‌రిని విస్మ‌యంలోకి ముంచెత్తుతున్నారు.

టెక్నాల‌జీని డెవ‌ల‌ప్ చేయాలే కానీ.. ఏపీకి 2020 నాటికే నెంబ‌ర్ వ‌న్ స్టేట్ గా మార్చేయొచ్చ‌ని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డ మంచి టెక్నాల‌జీ ఉన్నా దాన్ని ఏపీకి తీసుకురావాల‌ని చెబుతున్న ఆయ‌న‌.. సీఐఐ స‌ద‌స్సులో మాట్లాడారు. వాస్త‌వానికి 2029 నాటికి ఏపీని నెంబ‌ర్ వ‌న్‌ స్టేట్ చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని.. కానీ.. అంతా కృషి చేస్తే 2020 నాటికే ఆ స్థానంలోకి చేరుకోవ‌చ్చంటూ కొత్త‌మాట చెప్పుకొచ్చారు.

ఏపీ చ‌రిత్ర‌లో ఒక సునామీ సృష్టించాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల్నికోరిన చంద్ర‌బాబు.. ప్ర‌తిఒక్క వ్య‌క్తి రాష్ట్రం కోసం ఒక ప్రాజెక్టు త‌యారు చేయాల‌ని.. దాని వ‌ల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చారు.

ఏపీలో ప్ర‌పంచ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి సుదీర్ఘ‌మైన కోస్తా తీరం ఉండ‌టం గొప్ప వ‌రంగా పేర్కొన్నారు. ఇన్ని మాట‌లు చెబుతున్న చంద్ర‌బాబు.. ఏపీ లోటు గురించి.. కేంద్రం గురించి రావాల్సిన నిధుల గురించి.. కేవ‌లం 14 నెల‌ల వ్య‌వ‌ధిలో పెరిగిపోయిన రూ.17వేల కోట్ల అప్పు గురించి మాత్రం పెద్ద‌గా ఆలోచించిన‌ట్లుగా క‌నిపించ‌టం లేదు.

నెల గ‌డ‌వాలంటే నిధుల కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌కున్నా. మ‌రో ఐదేళ్ల (క‌చ్చితంగా చెప్పాలంటేనాలుగు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే) లోనే దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్టేట్ గా ఎదిగిపోతామ‌న్న చంద్ర‌బాబు మాట‌లు చూస్తే.. కాస్తంత విస్మ‌యం క‌ల‌గ‌టం ఖాయం.

రోజురోజుకీ పెరిగిపోతున్న అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని బ‌య‌ట‌ప‌డేసి.. అంద‌రూ బ‌తికేందుకు వీలున్న రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మిస్తే స‌రిపోతుంది. దానికి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌.. టూ అన్న పెద్ద పెద్ద మాట‌లు ఎందుకు చంద్ర‌బాబు..?
Tags:    

Similar News