బాబు ఇంత దుబారానా

Update: 2016-05-16 10:48 GMT
రాజ‌ధాని లేని రాష్ట్రం! ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రం! ఉద్యోగుల జీతాల‌కే కేంద్రంపై ఆధార‌పడాల్సిన ప‌రిస్థితి. రాజధాని నిర్మాణానికి  ప్ర‌జ‌ల నుంచి విరాళాలు సేక‌రించాల్సిన దుస్థితి. పైస‌ల కోసం ఇత‌రుల‌పై ఆధార‌ప‌డాల్సిన స్థితిలో ఉంది ఏపీ. అర‌కొర స‌దుపాయాలే త‌ప్ప.. ఇప్ప‌టికీ పూర్తిగా నిధులు లేక స‌త‌మ‌త‌మవుతోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టారు చంద్ర‌బాబు.. మ‌రి ఆర్థికంగా అంద‌రినీ పొదుపు మంత్రం పాటించాల‌ని.. చెబుతున్నారు బాబు! కానీ ఆయ‌న మాత్రం అస్స‌లు పొదుపు అనే మాటే ద‌రిదాపుల్లోకి రానివ్వ‌డం లేదట‌. కేవ‌లం ఆయ‌న కార్యాల‌యాలు.. క్యాంప్ ఆఫీసుల కోసం ఇప్ప‌టివ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టిన మొత్తం ఎంతో తెలిస్తే.. చంద్ర‌బాబు మ‌రీ ఇంత దుబారానా అని అనుకుంటారు.

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచు ప్రజలను త్యాగాలు చేయాలని కోరుతుంటారు. రాజధానికి విరాళాలు ఇవ్వాలని.. అంద‌రూ త‌లో ఇటుక ఇవ్వాలని అడుగుతుంటారు. కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక కథ‌నం ప్రకారం ఆయన మాత్రం ప్రభుత్వ ధ‌నాన్నితన క్యాంప్ ఆఫీస్ ల కోసం, అధికారిక కార్యాలయాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారట‌. ఇంతవరకు చంద్రబాబు వాటి కోసం ఖ‌ర్చుచేసింది ఎంతో తెలుసా.. రూ.80కోట్లు అని ఆ ప‌త్రిక‌ క‌థ‌నం. ఇప్పటికి ఆయన హైదరాబాద్ లోనే నాలుగు క్యాంప్ ఆఫీస్ లు మార్చారని, తాజాగా ఆయన ఫాం హౌజ్‌ మదీనాగూడాను క్యాంప్ ఆఫీస్ గా ప్రకటించారని తెలిపింది.

  జూబ్లిహిల్స్ లోని రోడ్ నెంబర్ 65 - రోడ్ నెంబర్ 25  - లేక్ వ్యూ అతిథి గృహం - తాజాగా మదీనాగూడ ఇంటిని ప్రకటించారు. వీటికి భద్రత ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని... ఒక్కోచోట రెండు కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు అయిందని ఆ పత్రిక చెబుతోంది. కాగా సచివాలయంలో ఆయన ఆఫీస్ కు 21 కోట్లు ఖర్చు చేశారని ఆ పత్రిక తెలిపింది. ఇక విజయవాడలో ఇప్పటికే రెండు క్యాంప్ ఆఫీస్ లు ఉన్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పూర్తి అయితే అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత రాజధాని నిర్మాణం జరిగితే మరో ఆఫీస్ కు కోట్లు వెచ్చించవలసి ఉంటుందని ఆ పత్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది. మ‌రి ఈ ప‌త్రిక విశ్లేష‌ణ బ‌ట్టి చూస్తే చంద్ర‌బాబు దుబారా ఖ‌ర్చు ఎక్కువ‌గానే చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Tags:    

Similar News