హవ్వా.. ఏంటి బాబూ-పవన్ ఈ విడ్డూరం..

Update: 2018-08-26 10:08 GMT
అంతన్నాడు.. ఇంతన్నాడే.. ఈ ‘పవనాలు’.. ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నాడే అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరాల కోసం కలిసి.. మోసం చేశాడని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరిపై బోలెడు విమర్శలున్నాయి.. చంద్రబాబును శూరుడు, ధీరుడు అని పొగిడి.. ఆయన లేకపోతే రాష్ట్రం వల్లకాడని ప్రకటించిన పవన్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఎందుకో ఫ్లేట్ ఫిరాయించాడు. అప్పుడు మొదలైన విమర్శల వాన ఇప్పటికీ చంద్రబాబుపై పడుతూనే ఉంది. పాపం బాబూ.. ఆయనకు పవన్ లా తిట్టడం రాదు అని ఇన్నాళ్లు టీడీపీ నేతల్లో ఆవేదన ఉండేది. ఇప్పుడు తెగాయించాడు. ఇక పవన్ ను బట్టిలిప్పి నిలబెట్టడమే ధ్యేయంగా విమర్శలు చేస్తున్నాడు.   వీరిద్దరూ ఒకనాడు పొగుడుకొని.. ఇప్పుడు తిట్టుకుంటున్న వైనంపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

పవన్ విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ నేరుగా స్పందించింది లేదు.. ఆచితూచి అన్నట్లే మాట్లాడేవారు.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా డైరెక్ట్ గా అటాక్ చేశాడు. పవన్ చేసిన వ్యాఖ్యలనే అస్త్రాలుగా మలిచి జనసేనానికి విసిరారు.

పవన్ జనసేన పార్టీ పెట్టిందే తనపై కుట్ర చేయడానికని తాజాగా బాబు ఆరోపించారు. అంతేకాదు.. మొన్నటివరకు చాలా బాగా అనిపించిన తాను ఇప్పుడు ఎందుకు పవన్ విమర్శిస్తున్నాడో చెప్పాలని బాబు గారు డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి కేంద్రం రూ.75వేల కోట్లు ఇవ్వాలని నిపుణుల కమిటీ పెట్టి తేల్చిన పవన్ ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదో చెప్పాలని బాబు ప్రశ్నిస్తున్నారు. పవన్ మాటల్నే ఆయుధాలుగా మలుచుకొని బాబు  సంధించిన ప్రశ్నలకు జనసేనాని ఎలాంటి సమాధానం ఇస్తాడన్నది ఆసక్తిగా మారింది.

అయితే జనాలకు మాత్రం ఒకటే డౌట్ ఉంది. వీరు ఆనాడు ఎందుకు ఒకరినొకరు మెచ్చుకున్నారు.. ఇప్పుడెందుకు తిట్టుకుంటున్నారు.. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీని కాదని.. పవన్ బాబును ఎందుకు తిడుతున్నట్టు.. సరే అవినీతిపాలనతో మకిలిపట్టిన బాబు నైజాన్ని ఇప్పుడు తీరం దాటాక విమర్శిస్తున్న పవన్ ముందే ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు.? ఇవన్నీ పవన్ కు ముందే తెలియవా.? ఈ ప్రశ్నలన్నింటిని వైసీపీ నేతలు వివిధ మీడియా చానల్స్ లో వేస్తూనే ఉన్నారు.

ఇక చంద్రబాబేం తక్కువ తినలేదు.. పవన్ మద్దతు కోసం ఇన్నాళ్లు వేచిఉండి ఇక ఆయన మద్దతు లభించదని తెలిసి ఇప్పుడు తిట్టడం మొదలుపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవరసం ఉన్నంత వరకు  వాడేసుకొని అవసరం తీరాక తిట్టుకుంటున్న ఈ ఇద్దరు నేతల వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News