గడ్కరీ - బాబు ఎడమొహం పెడమొహం

Update: 2018-04-13 16:03 GMT
ఎన్డీయేతో సంబంధాలు తెంచుకున్న తరువాత టీడీపీ - బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక సమావేశంలో పక్కపక్కనే కూర్చున్నా ఒకరినొకరు పలకరించుకోకుండా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. విదేశీ వేదికపై కనిపించిన ఈ దృశ్యం రాజకీయాల తీరుకు అద్దం పట్టింది.
    
సింగపూర్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ సదర్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ - చంద్రబాబు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదు.
    
ప్రత్యేక హోదా - విభజన హామీలను అమలు చేయట్లేదంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి - ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చేసిన చంద్రబాబు బీజేపీపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంపై ఆయన అవిశ్వాసం పెట్టడం.. దాన్ని చర్చకు రాకుండా బీజేపీ రాజకీయం చేయడం తెలిసిందే. అనంతరం ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు - ఆయన పార్టీ ఎంపీలు - నేతలు ఆందోళనలు కూడా చేశారు. ఇదే సమయంలో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నుంచి కూడా బీజేపీ బయటకొచ్చేసింది. అంతేకాదు.. చంద్రబాబుకు కౌంటర్‌ గా బీజేపీ నేతలు కూడా ఆందోళనలు - దీక్షలు చేశారు. ఇలా రెండు పార్టీలు ఒకరి ప్రభుత్వాలపై మరొకరు బురద చల్లుకుంటూ సిగపట్లు పడుతున్నారు.
    
అంతేకాదు.. కేంద్రం - ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదాల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టు విషయంలో నితిన్ గడ్కరీని కేంద్రం పరిశీలనకు గతంలో పంపించింది. దానిపై ఆయన మోదీకి సమగ్ర నివేదికలూ ఇచ్చారు. రెండు పార్టీలు సఖ్యతతో ఉన్న సమయంలో చంద్రబాబు దిల్లీ వెళ్లినప్పుడల్లా కలిసే కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు స్నేహం కటీఫ్ అయిన తరువాత చంద్రబాబు - గడ్కరీలు ఇలా మొహాలు మాడ్చుకోవడంతో రాజకీయాల్లో ఇంతే అంటున్నారంతా.
Tags:    

Similar News