బాబుకు అదే ప‌నిగా కోపం వ‌స్తుందే?

Update: 2018-03-03 17:30 GMT
కోపం మంచిది కాదు. హ‌ద్దులు దాటితే అన‌వ‌స‌ర‌మైన త‌ప్పులు జ‌రుగుతాయి. ఇలాంటి విష‌యాలు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలియంది కాదు. కానీ.. ఇప్పుడు ఆయ‌న త‌న‌కు త‌ర‌చూ కోపం రావాల‌ని కోరుకుంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే.. కోపం తెప్పించేసుకుంటున్నారు. క‌మ‌ల‌నాథుల‌తో క‌టీఫ్ చెప్పేందుకు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ రెఢీ చేసుకోవ‌టానికి ఆయ‌న ప‌డుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు.

ఏపీ విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హోదా మీద చేస్తున్న పోరాటం పుణ్య‌మా అని ఆంధ్రోళ్ల‌ల్లో ఆగ్ర‌హం అంత‌కంత‌కూ పెరుగుతోంది. దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టం కోసం బాబు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. నాలుగేళ్లుగా గుర్తుకు రాని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇప్పుడు గుర్తుకు వ‌స్తున్నాయి.

రాష్ట్రం కోసం రాజీ ప‌డేది లేద‌ని చెబుతున్నారు. మ‌రి.. నాలుగేళ్ల మాట అన్న ప్ర‌శ్న‌ను అడిగేంత‌లో ఆయ‌నే ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. హోదా సాధ్యం కాద‌ని.. దానికి త‌గ్గంత ప్ర‌త్యేక ప్యాకేజీని ఇస్తాన‌ని చెప్ప‌టం వ‌ల్లే తాము ఒప్పుకున్న‌ట్లు చెబుతూ.. గ‌తంలో చేసిన త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మోడీ స‌ర్కారు ఏపీకి హ్యాండ్ ఇవ్వ‌టంలో త‌న చేత‌కానిత‌నాన్ని క‌వ‌ర్ చేసుకునేందుకు చంద్ర‌బాబు చిత్ర‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తెస్తున్నారు. గ‌తంలో 42 మంది ఎంపీలు ఉండేవార‌ని.. విభ‌జ‌న కార‌ణంగా ఆ సంఖ్య తగ్గిపోవ‌టంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేక‌పోతున్నామ‌ని చెబుతున్నారు. విభ‌జ‌న‌కు అనుకూలంగా నాడు కేంద్రానికి లేఖ ఇచ్చిన‌ప్పుడు చంద్ర‌బాబుకు ఈ విష‌యాలు గుర్తు లేవా అన్న‌ది ప్ర‌శ్న‌.

విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు బ‌ల‌హీన ప‌డ్డాయ‌ని.. నాలుగేళ్లు గ‌డిచినా విభ‌జ‌న గాయాలు మాన‌లేద‌న్నారు. ఏపీ ఆర్థిక‌లోటు భ‌ర్తీకి ఫార్ములా ఇచ్చామ‌న్న కేంద్రం తీరుపైనా బాబుకు కోపం త‌న్నుకొచ్చింది. గ‌తంలో కోపం వ‌చ్చిన‌ప్పుడు గుండెల్లో దాచుకునే వారే కానీ.. పెద‌వుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేది కాదు. ఇప్పుడా సీన్ మారిపోయింది. ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా బాబు త‌న ఆగ్ర‌హాన్ని బాహాటంగా ప్ర‌ద‌ర్శించేస్తున్నారు. క‌మ‌ల‌నాథుల్ని ఉద్దేశించి కరుకు విమ‌ర్శ‌ల్ని మొహ‌మాటం లేకుండా చేస్తున్నారు. ప్ర‌జ‌ల్ని న‌మ్మించ‌టానికి.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో తానెంత సీరియ‌స్ అన్న విష‌యాన్ని చెప్పేందుకు కోపాన్ని మాగ్జిమ‌మ్ వాడేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News