క్రెడిట్ మొత్తం జగన్ కే ఇస్తున్న బాబు!

Update: 2017-01-26 13:55 GMT
ఏపీవాసులు ఎంతో బలంగా కోరుకుంటున్న "ప్రత్యేక హోదా" విషయంలో అది అడిగి తేవాల్సినవారు, పోరాడి అయినా తెచ్చుకోవాల్సిన వారూ అయిన రాష్ట్రంలోని అధికారపక్షం పెద్దలు.. మౌనాన్నే తమ బాషగా చేసుకుని కేంద్రానికి బానిసైపోయిన పరిస్థితులు నేడు ఏపీలో నెలకొన్నాయి! ఈ సమయంలో తమిళనాడులో జల్లికట్టు సంఘటన రావడం.. అదే ఊపుతో, అదే స్పూర్తితో ఏపీ యువత కూడా "మౌన నిరసన"కు సిద్దపడటం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలోని ఆర్కే బీచ్ లో మౌన ప్రదర్శనకు యువత - కొవ్వొత్తుల ప్రదర్శనకు వైకాపా పిలుపునిచ్చారు. అంతా సవ్యంగా, సాఫీగా సాగిపోయి.. ఫైనల్ గా ఇదొక వార్త అయ్యేది, ఒక చిన్న విషయంగా గడిచిపోయేది. కానీ... ఏపీ ప్రభుత్వం చేసిన పనికి, తీసుకున్న నిర్ణయానికి ఇది కాస్త రణరంగంగా మారింది, ఏపీ యువతలో మరింత కసిని పెంచింది!!

అవును... మౌన పోరాటానికి సైతం మద్దతివ్వకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు - విశాఖ ప్రత్యేక హోదా కార్యక్రామానికి కొత్త ఊపునిచ్చాయనే చెప్పాలి. ఇదే క్రమంలో రాజకీయంగా చూసుకుంటే... చంద్రబాబు పొరపాటు చేశారనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని, ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తుందని ఇప్పటికే జనాల్లోకి విషయం బలంగా దూసుకెళ్లిపోయింది! జగన్ ను టార్గెట్ చేస్తూ తిట్టడం వల్ల ప్రభుత్వ పెద్దలకు ఏమి వచ్చింది, విమానాశ్రయం నుంచి వెనక్కి జగన్ ను తిప్పిపంపడం వల్ల ఏమి చేకూరింది? యువతను ముందస్తుగా అరెస్టులు చేయడం వల్ల సాధించిందేమిటి? ఆర్కే బీచ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్ల ఒరిగిందేమిటి?

నిజంగా జగన్ మౌన ప్రదర్శనో, క్యాండిల్ ర్యాలీనో చేసి ఉంటే అది హోదా కోసం జగన్ చేసిన చాలా పోరాటాల్లో ఒకటిగా మిగిలేది! కానీ... జగన్ ను విమానాశ్రయంలోనే నిర్భందించి, వెనక్కి బలవంతంగా పంపడం వల్ల ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తున్నాయి. జగన్ పోరాటానికి, హోదా విషయంలో జగన్ పిలుపుకి ప్రభుత్వ పెద్దలు మరీ ఈ రేంజ్ లో స్పందించారంటే... ఫలితం కచ్చితంగా పాజిటివ్ గా వచ్చి ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాబు పోరాడలేరు సరికదా... జగన్ పోరాడినా కూడా, ఈ వ్యాఖ్యలు ఢిల్లీ వరకూ చేరి ఉన్నా కూడా రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరిగేది కదా!

రాష్ట్రంలో, కేంద్రానికి వ్యతిరేకంగా యువత పోరాడుతుంటే... కలిసి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాలేదు సరికదా, అణిచివేయాలని ఎందుకు చూస్తుంది.. బీజేపీకి లేని నొప్పి టీడీపీకెందుకు.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇప్పటికే తాకట్టు పెట్టి సొమ్ము తెచ్చేసుకున్నాక, ఆ వస్తువేది అని అడిగితే ఎలా అనేది పెద్దల ఆలోచనా.. ఏమో?

ఏది ఏమైనా... నేటి ఏపీ యువత నిరసన విషయంలో ఏపీ ప్రభుత్వం అనాలోచితంగానో, అతి తెలివితేటలతోనో తీసుకున్న ప్రతీ నిర్ణయం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేదిగా ఉందనడంలో సందేహం లేదు. ఇదే క్రమంలో జగన్ కు సానుకూలంగా మారుతుందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి!! దీంతో... ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే కోరిక బలంగా జగన్ కు మాత్రమే ఉంది తప్ప, బాబుకి ఏ కోసానా లేదు అని జనాలు ఫిక్సయిపోవచ్చేమో!! ఆ పరిస్థితి తీసుకొచ్చింది కూడా బాబు గారే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News