ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు తన మంత్రివర్గ సహచరులకే షాక్ ఇచ్చారు. కీలక వర్గానికి మేలు చేయాలని తలపెట్టిన ఎపిసోడ్ లో అక్కడ పరిస్థితులు దారితప్పడం...ఆఖరికి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో బాబు కొరడా ఝులిపించారు. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీ గురించి. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి, ఆ కులానికి చెందిన యువతకు సొంత ఖర్చులతో విదేశీ విద్యా రుణాలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ గత కొద్దికాలం నుంచీ గాడి తప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యల కొరడా ఝుళిపించటం సంచలనం రేపింది. కార్పొరేషన్ ఎండీ అమరేంద్రపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలమే రేపింది. ఆయనను మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగుదేశం వర్గాలు - కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరి అభిప్రాయాం ప్రకారం అమరేంద్రపై బదిలీ వేటు వేయాలని ప్రభుత్వం చాలాకాలం క్రితమే భావించినా నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి - శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి చక్రం అడ్డు వేస్తూ వచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్టీఆర్ విద్యోన్నతి - నైపుణ్యాభివృద్ధి శిక్షణ - కోచింగ్ సెంటర్ల ఎంపిక - నిధుల విడుదల వంటి అంశాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణిని ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఎండీకి మద్దతిస్తోన్న ఆ ఇద్దరు మంత్రులు - ఓ ఐఏఎస్ కు షాకిచ్చాయని అంటున్నారు. ఎందుకంటే సదరు మంత్రులిద్దరికి తెలియకుండానే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మికి ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే అమరేంద్ర ఎండీ హోదాలో ఉండగా విచారణ సక్రమంగా జరగదన్న భావనతో ఆయనను తప్పించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, ఈ బదిలీలో మరో ఆసక్తికరమై పరిణామం చోటు చేసుకుంది. సహజంగా ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వుల్లో బదిలీ కారణాలను పేర్కొన్నారు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడాన్ని బట్టి ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో స్పష్టమవుతోందని కాపు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపు వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోందని అంటున్నారు. ఎండీ- చైర్మన్ వ్యక్తిగత వైరం వల్ల కాపు కార్పొరేషన్ పనితీరు అప్రతిష్ఠ పాలవుతోందని పలువురు కాపు నేతలు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవలసిందని, మంత్రుల ఒత్తిళ్లతో ఆలస్యం చేశారనే వ్యాఖ్యలు కాపు సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. నిజాయితీ కలిగిన అధికారిగా పేరున్న ఉదయలక్ష్మికి ఆ శాఖ బాధ్యతలు అప్పగించిన తర్వాతనే కాపు కార్పొరేషన్ వ్యవహారాలు విచారణకు నోచుకున్నాయని, గతంలో ఒక మంత్రి - ఓ ఐఏఎస్ అధికారి దన్నుగా నిలిచినందుకే ఇంతకాలం వెలుగులోకి రాలేదంటున్నారు.