ఆమె మాటతో బాబు ముఖం వెలిగిపోయింది

Update: 2016-11-02 06:03 GMT
రాజకీయ నాయకుడికి ప్రశంసకు మించిన టానిక్ మరేదీ ఉండదు. విమర్శల కత్తులు నిత్యం గాయాలు చేసే వేళ.. ఒక ప్రశంస అంతులేని శక్తిని ఇవ్వటమే కాదు.. మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవటానికి కారణం అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఏపీ అధికారపక్షం తాజాగా షురూ చేసిన జనచైతన్య యాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనంతో మమేకం అయ్యేందుకు భారీ ప్రణాళిక రచించారు. తన పాలన ఎలా ఉందన్న క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ను తనకు తానే స్వయంగా తెలుసుకునేలా తాజా యాత్రను ప్లాన్ చేశారు.

తొలి రోజున ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలినడకన పర్యటించారు. ఉమ అనే ఒక అవ్వను పలుకరించిన చంద్రబాబు.. ‘‘ఏం పెద్దమ్మా పెన్షన్ సక్రమంగా వస్తోందా?’’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్ అందుతుందని చెప్పింది. అక్కడితో ఆగని బాబు.. మరికాస్త చొరవగా.. ఎంతమంది పిల్లలని క్షేమ సమాచారం అడిగారు. దీనికి బదులిచ్చిన అవ్వ.. తనకు ముగ్గురు పిల్లలని.. వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని చెప్పింది.

తన ముగ్గురు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారని.. కానీ.. తనకు వచ్చే వెయ్యి రూపాయిల పింఛన్ మాత్రం క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వస్తుందని చెప్పిన ఆమె మాటతో చంద్రబాబు ముఖం వెలిగిపోయింది. బాబు సర్కారు ఇస్తున్న వెయ్యి రూపాయి పింఛన్ తో పెద్ద వయసులో ఒకరి మీద ఆధారపడకుండా.. సొంత కాళ్ల మీద ఆత్మగౌరవంతో బతుకుతున్నట్లుగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. తాను కానీ అధికారంలోకి వస్తే.. ప్రతి ఇంటికి పెద్ద కొడుకును అవుతానని ప్రకటించిన బాబుకు.. అవ్వ మాటలు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News