జైట్లీ మాటకు బాబుకు బాధ కలిగిందట

Update: 2016-07-30 04:23 GMT
రాజ్యసభ సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో.. బాధ కలిగిన బాబుగారు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేశారు. జరిగింది  అన్యాయమని.. నమ్మక ద్రోహమని అందరికి తెలిసిన విషయాల్నే ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గంటల కొద్దీ చెప్పిన మాటల్నే చెప్పుకుంటూ పోయారు. ఈ సందర్భంగా తన ఆవేదనను.. ఆవేశాన్ని మిక్స్ చేసి మాటల రూపంలో చెప్పుకొచ్చిన మాటల్లో ఒకట్రెండు తప్పించి మిగిలినవన్నీ పాత సీడీలోని మాటలే.

హోదా మీద జైట్లీ ఇచ్చిన సమాధానం నేపథ్యంలో హోదా అన్నది లేదని తేలిపోయింది. వాస్తవానికి ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలోనే ఈ విషయం స్పష్టమైంది. కేవీపీ ఒక బిల్లు పెట్టేసి.. దానికి రాజ్యసభలోని 11 పార్టీలు ఏపీకి అనుకూలంగా మాట్లాడినా.. కేంద్రం మాత్రం నో అంటే నో అనేసింది. కేంద్రం నోట నో అన్న మాట వచ్చాక ప్రెస్ మీట్ పెట్టేసిన చంద్రబాబు.. చాలానే మాటలు చెప్పారు. తనకు చాలా బాధ కలిగిందంటూ బావురమన్న బాబు.. ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి రెండు నిమిషాలే అన్న ఆయన.. అంతలోనే సర్దుకొని మాట మార్చేశారు. ప్రత్యేక హోదా లేదని తేలిపోయిన తర్వాత కేంద్రానికి ఒక అల్టిమేటం జారీ చేయటం.. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఫలితం తప్పదంటూ కార్యాచరణను ప్రకటించింది లేదు.

కేంద్రం తీరును తప్పు పడుతూ నాలుగు మాటలు చెప్పిన చంద్రబాబు మాటల్లోని కీలక వ్యాఖ్యలు చూస్తే..

= అనాడు అన్ని ఇస్తామన్నారు. ఇప్పుడేమో నిధులు లేవంటున్నారు. కేంద్రం దగ్గర డబ్బులు లేవు. దేశం భరించలేదనుకున్నప్పుడు కాంగ్రెస్.. బీజేపీ కలిసి విభజనకు ఎందుకు ఒప్పుకున్నాయి? అన్యాయానికి దేశంలోని ప్రతి పరాటీ బాధ్యత తీసుకోవాలి. ఇకనైనా నాటకాలు ఆపాలి.

= ఆర్థికమంత్రి ఏపీకి రూ.1.6లక్షల కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు రాష్ట్రానికి కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. మాకు అనుకూలంగా చేయమని అడగటం లేదు. న్యాయం చేయాలని మాత్రమే కోరుతున్నాం. ఒకటికి పదిసార్లు ఢిల్లీకి వెళ్లి సాయం చేయాలని కోరాను. ఏపీకి అన్యాయం జరిగిందని చెబుతున్నారు కానీ సాయం మాత్రం చేయటం లేదు.

= ఆంధ్రప్రదేశ్ కు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటి విషయంలో కేంద్రం వైఖరి దారుణంగా ఉంది. దీనిపై మనం పోరాడాల్సిందే. వెనకాడాల్సిన అవసరమే లేదు. పొమ్మంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి నిరభ్యంతరంగా బయటకు వచ్చేద్దాం. రాష్ట్రప్రయోజనాల విషయం మాత్రం రాజీ లేదు.

= జైట్లీ 14వ ఆర్థిక సంఘం నిధుల గురించి మాట్లాడారు. అసలు రాష్ట్రానికి.. ప్రత్యేక హోదాకు.. ఆర్థిక సంఘం నిధులకు సంబందం ఏమిటి? 14వ ఆర్థిక సంఘం మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే మన రాష్ట్రానికీ నిధులు ఇచ్చింది.

= ఓపిగ్గా అడుక్కుంటున్నా. ఇది మంచిది కాదని కేంద్రానికి చెబుతా. కేంద్ర విద్యా సంస్థల ప్రహరీ గోడల నిర్మాణానికి మేమే డబ్బులు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టుకు రూ.850 కోట్లు ఇచ్చారు. ఇలా అయితే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అయ్యేను?

= ఇన్ని రోజులు ఓపిగ్గా ఉన్నానంటే.. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారనే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. టీడీపీ సహకారంతో ఏడుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో చేరమంటే చేరలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో చేతులు కలిపాం.

= గత రెండేళ్లుగా ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి అన్యాయాన్ని సరి చేయాలని కోరాను. నేను ఎన్నిసార్లు వెళ్లినా స్పందించలేదు. వాళ్లు ఎగతాళి చేసినా నా బాధ్యత నిర్వర్తించా. రాష్ట్రానికి న్యాయం చేయమని ఇప్పటికీ గట్టిగా అడుగుతున్నా. అవసరమైతే మరోసారి ఢిల్లీకి వెళతా. వాళ్లు ఇవ్వరనుకుంటే వెళ్లాల్సిన అవసరం లేదు.

= విభజన జరిగిన తీరును సుప్రీంకోర్టుకూడా తప్పు పట్టింది. ఉన్నత విద్యామండలి విషయంలో రెండునెలల్లో సమస్యను పరిష్కరించాలని.. లేకపోతే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరించాలని చెప్పింది. ఇంతవరకూ కేంద్రం నుంచి స్పందన లేదు.

= ఆరు సూత్రాల పథకం ఉన్నా.. రాష్ట్రాన్ని విభజించొచ్చని అప్పట్లో చెప్పిన అటార్నీ జనరల్.. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు పెంచమని రెండు రాష్ట్రాలు అడుగుతుంటే కుదరదని చెబుతున్నారు. ఇలా అయితే ప్రజలు పార్లమెంటుపైనా.. రాజ్యాంగం పైనా నమ్మకం ఎలా ఉంటుంది..?

= ఆంధప్రదేశ్ రెండేళ్ల పసిబిడ్డ. అందరికీ మన మీద కనికరం ఉండాలి. బీజేపీఎందుకు ఆలస్యం చేస్తోంది. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవటం లేదు? లోటు బడ్జెట్ ను భర్తీ చేస్తామన్నారు. ఆ తర్వాత మీ ప్రభుత్వ పథకాలు మార్చుకున్నారు కనుక డబ్బుల్లేవని చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. మీరు కూడా మీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగానే మీ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు కదా..?

=  ప్రత్యేక హోదాకు సాంకేతిక అంశాలు.. ఆర్థిక పరిస్థితులు అడ్డం రావు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దీనికి పోలిక కాదు. మనం కోరుకున్న విభజన కాదు. మన నెత్తిన బలవంతంగా రుద్దారు. అలాంటప్పుడు అన్యాయాన్ని సరిదద్దే బాధ్యత దేశంలోని అన్ని రాజకీయపార్టీలపైనా ఉంది. ఓవైపుఇంత జరుగుతుంటే.. అప్పుడే దిష్టిబొమ్మలు దగ్థం చేయాలని కాంగ్రెస్.. బంద్ పాటించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పిలుపునివ్వటం నాటకాలు ఆడటమే.

= రాజధాని విషయంలో చాలా మాటలు చెబుతున్నారు. రాజధానికి రూ.2050కోట్లు ఇచ్చామన్నారు. అందులో రూ.వెయ్యికోట్లు గుంటూరు.. విజయవాడకు మాత్రమే ఇచ్చారు. రోడ్ల ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ.. ప్రైవేటు భాగస్వామ్యంతో చేసేవే. అవి మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చినట్లే ఏపీలోనూ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఇస్తున్నదేమీ లేదు.
Tags:    

Similar News