అన్నేసి గంటలు అలా మాట్లాడటం బాబుకే చెల్లు

Update: 2016-05-30 07:28 GMT
తిరుపతిలో మూడు రోజుల పాటు సాగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గంటల కొద్దీ ప్రసంగాలు చేయటం తెలిసిందే. రోజూ అన్నేసి గంటలు మాట్లాడిన చంద్రబాబు ఓపికను ఎవరైనా అభినందించాల్సిందే. చెప్పిన విషయాన్ని మళ్లీ.. మళ్లీ చెప్పుకుంటూ.. కొత్తగా అనిపించేలా ప్రయత్నిస్తూ.. పరిమితులకు లోబడి ప్రసంగం చేయటం అంత చిన్న విషయం కాదు మరి.

చంద్రబాబుకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఆయన కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు చేయలేరు. ఏపీ ప్రత్యేక హోదా ఎంత అవసరమన్న విషయం తెలిసినా.. ఆ అంశంపై ప్రధాని మోడీ మొండిగా వ్యవహరిస్తూ సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా లేకున్నా.. ఆ విషయాన్ని ఓపెన్ గా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే అది మిత్రధర్మం కాదు కాబట్టి.

ఇదిలా ఉంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణ అధికారపక్షం గురించి చంద్రబాబు మాట్లాడలేని పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో అంటే.. రెండేళ్ల క్రితం జరిగిన మహానాడులో 2019లో తెలంగాణలో తాము పవర్ లోకి వస్తామని ఘంటా పథంగా చెప్పేవారు.  పవర్ లోకి వస్తామన్న మాటతో పాటు.. అప్పటివరకూ హైదరాబాద్ వదిలేది లేదని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏపీకి వెళతానన్న మాటల్ని కూడా బాబు చెప్పేవారు. కానీ.. పరిస్థితుల ప్రభావంతో ఆయన ముందే అమరావతికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.

అలా అని తెలంగాణ ప్రభుత్వంతో సత్ సంబంధాలు ఉన్నాయా? అంటే ఏమాత్రం లేవు. ఓపక్క తెలంగాణ సర్కారు కొత్త ప్రాజెక్టులను నిర్మించటం.. దానికి ఏపీ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. ఫిర్యాదులు చేయటం లాంటి లొల్లి ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్యన ఉంది. అదే సమయంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తెలంగాణ అధికారపక్షం ఆపరేషన్ ఆకర్ష్ తో తీసుకెళ్లిన వైనంపైనా తన ఆవేదనను వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే అలాంటి పనే తాను ఏపీ విపక్షం విషయంలో చేసిన నేపథ్యంలో.. టీఆర్ ఎస్ అధినేతపై నిప్పులు చెరగలేరు. అందుకే కాబోలు.. మూడురోజుల మహానాడులో చంద్రబాబు నోటి నుంచి కేసీఆర్ అండ్ కో మీద ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకుండా తన ప్రసంగాల్ని ముగించటం గమనార్హం. ఓపక్క మోడీ.. మరోపక్క కేసీఆర్ టాపిక్ రాకుండా అన్నేసి గంటలు మాట్లాడిన బాబును నిజంగా అభినందించాల్సిందే.
Tags:    

Similar News