బాబు నోట పేద‌రిక‌పు మాట‌లు విన్నారా?

Update: 2018-07-03 05:01 GMT
ఎక్క‌డికైనా వెళ్లాలంటే ప్ర‌త్యేక విమానం.. సెవ‌న్ స్టార్ హోటల్లో బ‌స‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ముఖ్య‌మంత్రి అడంబ‌రాల‌కు అంతూపొంతు ఉండ‌దు. ఖ‌ర్చుల విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌ని చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల‌కు.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏమైనా చేయాల్సి వ‌స్తే మాత్రం వెంట‌నే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంద‌న్న విష‌యాన్ని దీనంగా చెప్పుకోవ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

మోడీతో క‌టీఫ్ చెప్పిన నాటి నుంచి కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న బాబు.. ఆర్థికంగా ఎలాంటి చేయూత అంద‌టం లేద‌న్న మాట‌ను చెబుతున్నారు. పోరాటంతో హ‌క్కుల్ని సాధించుకుంటామ‌ని చెబుతున్న ఆయ‌న‌.. నాలుగేళ్లుగా ఏం చేస్తున్న‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబితే బాగుంటుంది.

బెజ‌వాడ‌లో హోంగార్డులు నిర్వ‌హించిన ఆత్మీయ అభినంద‌న స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌..  భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు ఎక్క‌డ ఉంటే అక్క‌డ హోంగార్డులు ఉంటార‌ని.. ఈ కార‌ణంతోనే ఆర్థిక‌స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ వారికి వేత‌నాలు పెంచిన‌ట్లుగా పేర్కొన్నారు. త‌న దృష్టిలో పోటీసులు.. హోంగార్డులు వేర్వేరు కాద‌ని.. కానిస్టేబుల్ తో స‌మానంగా క‌ష్ట‌ప‌డే హోంగార్డులు పోలీసుల‌తో స‌మానంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా ఉంటే హోంగార్డుల‌కు చాలా చేయాల‌ని త‌న‌కున్నా.. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా చేయ‌లేక‌పోతున్న‌ట్లు చెప్పారు. హోంగార్డుల్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పారు. నాలుగేళ్ల‌లో హోంగార్డుల జీతాల్ని రెట్టింపు చేసిన‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఎన్టీఆర్ వైద్య‌సేవ‌.. ప‌క్కా గృహాలు.. ప్ర‌మాద‌బీమా..వారాంత‌పు సెలవులు త‌దిత‌ర సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌ల్లోకి తెచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. కొత్త డీజీపీ ఠాకూర్ మాదిరి ఫిట్ గా ఉండాల‌ని.. అందుకోసం సైకిల్ తొక్క‌టం.. ఈత కొట్ట‌టం లాంటివి చేయాల‌న్నారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో జ‌ల ప్ర‌మాదాలు ఎక్కువ‌గా చోటు చేసుకుంటున్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ ఈత నేర్చుకోవ‌టం.. నీళ్ల‌ల్లో మునిగిపోతున్న వారిని రక్షించేలా శిక్ష‌ణ తీసుకోవాల‌న్నారు. ఆర్థికంగా రాష్ట్రం గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ‌.. దీక్ష‌ల‌తో కోట్లు ఖ‌ర్చు పెట్ట‌టం.. ఆడంబ‌రాల కోసం పెట్టే ఖ‌ర్చును బాబు త‌గ్గించుకోరెందుకో?
Tags:    

Similar News