'ఎట్ హోం'లో అరుదైన కలయికలు చూశారా?

Update: 2016-08-16 02:36 GMT
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఇచ్చిన "ఎట్ హోం" ఎంత అహ్లాదకరంగా జరిగిందో ఇప్పటికే గవర్నర్ తనదైన శైలిలో చెప్పారు. ఇద్దరు చంద్రులతో ఈరోజు రాజ్ భవన్ లో ఫుల్ మూన్ ఏర్పడిందని కామెంట్లు వినిపించాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కూడా ఫుల్ ఉత్సాహంగా కనిపిస్తూ మీడియా మిత్రులతో సరదా సంభాషణలు కూడా చేశారు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన కలయికలు రాజ్ భవన్ వేదికగా కనిపించాయి. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - చంద్రబాబు కలవడం ఈమధ్య కాలంలో సర్వసాధారణమైపోయినా.. మరికొన్ని అరుదైన కలయికలు ఈ ఎట్ హోం సందర్భంగా కనువిందుచేశాయి.

ఎట్ హోమ్‌ సందర్భంగా జరిగిన అరుదైన కలయికల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లది కూడా ఒక్కటిగా చెబుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ని చూసిన జగన్ దగ్గరకు రావడం.. కేసీఆర్ లేచి కరచాలనం చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ మధ్యకాలంలో జరిగిన అరుదైన కలయికల్లో దీన్ని ఒకటిగా చెబుతున్నారు. కేసీఆర్ - జగన్ లపై టీడీపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపణలు చేసినా... నోటుకు ఓటు కేసు అనంతరం ఈ విమర్శలు కొంతవరకూ తగ్గాయి. ఈ నేపథ్యంలో.. ఇద్దరూ ఇలా కలవడం వారి వారి అభిమానులకు మాత్రం ఆనందాన్నే పంచిందని చెప్పాలి. ఇదే సమయంలో జగన్ తిరిగి వెళ్లిపొతున్న సమయంలో తెలంగాణ మంత్రులూ జగన్ కు వీడ్కోలు పలికేందుకు లేచి కరచాలనం చేశారు.

ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సరదా విషయం చక్రపాణి ద్వారా జరిగింది. ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి వైఎస్. జగన్ చేయి పట్టుకుని మరీ తీసుకుని వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర కరచాలనం ఇప్పించారు. ఇదేమిటి చంద్రబాబు నేరుగా జగన్ దగ్గరకు వెళ్లో.. జగన్, బాబు దగ్గరకు వచ్చో కరచాలనం చేసుకోలేరా.. మధ్యలో చక్రపాణి మధ్యవర్తిత్వం దేనికి అనుకునేరు! అంతకు ముందే కార్యక్రమం ప్రారంభంలోనే జగన్ - బాబు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కానీ పాపం అది గమనించని చక్రపాణి మరోసారి చేతులు కలిపించారు.  

అదేవిదంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదేసమయంలో మరో అరుదైన సంఘటనగా.. టీడీపీ తరుపున కేంద్రమంత్రి అయిన సుజనా చౌదరి - తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపు మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, ఎన్.చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి లతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, ఇరు రాష్ట్రాల శాసన సభా స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్‌ రావు, మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయినవారిలో ఉన్నారు. కాగా.. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ ల నుంచి ఎవరూ ఎట్ హోమ్‌కు హాజరు కాలేదు.
Tags:    

Similar News