కాపులంటే రెండు జిల్లాల వాళ్లు మాత్రమేనా?

Update: 2017-08-14 04:15 GMT
కాపుల డిమాండ్లను నీరుగార్చడంలో వారిలో వ్యక్తమవుతున్న కోర్కెలను అణిచేయడంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదేమో అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు సోమవారం నాడు ప్రత్యేకంగా కాపు నేతలతో సమావేశం అంటూ.. విజయవాడలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగులో కాపు రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఓ స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారని కూడా అనుకుంటున్నారు. తద్వారా రిజర్వేషన్ల గురించి ఎవరూ ఎలాంటి కొత్త డిమాండ్లు చేయకుండా.. తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అనుకోకుండా.. మధ్యలో ఒక భరోసా కల్పించడం అనేది చంద్రబాబు లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ప్రజలు అనుమానిస్తున్నదేంటంటే.. కేవలం ముద్రగడకు ఉన్న ప్రాబల్యం ఆయన చేస్తున్న పాదయాత్ర ప్రయత్నాల పట్ల ప్రజల్లో వెల్లువెత్తుతున్న సానుభూతిని అణిచేయడానికే ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని!!

అయితే ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. కేవలం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు - కాపు సామాజికవర్గ ప్రతినిధులు - యువతను మాత్రమే ఈ బెజవాడ సమావేశానికి పిలుస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చాలా పరిమిత సంఖ్యలోనే కాపులు తరలివస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం వెనుక చంద్రబాబు వ్యూహం బహుశా.. ముద్రగడ పద్మనాభం పట్ల సానుభూతి రాకుండా చూసుకోవడం మాత్రమే అని పలువురు అనుకుంటున్నారు.

కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం వ్యవహారం రోజురోజుకూ చంద్రబాబును బాగా చికాకు పెట్టేస్తున్నది. ఆయన ప్రతిరోజూ ఇంట్లోంచి బయటకు వచ్చి.. పాదయాత్ర చేస్తా అనడం.. పోలీసులు కుదరదంటూ నిర్బంధించడం.. ఆయన వారితో గొడవ పెట్టుకోవడం రోజూ జరుగుతోంది. ఇదంతా ప్రతిరోజూ వార్తల్లోకి వస్తూ.. చంద్రబాబు సర్కారు పని గట్టుకుని ఆయన దీక్షను తొక్కేస్తున్నదనే అభిప్రాయం కలిగిస్తోంది. పైగా ఆ రెండు గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ప్రాబల్యం కూడా ఎక్కువే. ముద్రగడ కు మద్దతు ఇవ్వడానికి నిత్యం ప్రయత్నిస్తున్న వారు, కిర్లంపూడి వెళ్లడానికి చూస్తున్న వారు కూడా ఎక్కువే. వారినందరినీ నియంత్రించడానికి ప్రభుత్వం విపరీతంగా పోలీసు ప్రయోగాలు చేయాల్సి వస్తున్నది. ఇలాటి నేపథ్యంలో ముందు.. ఆ రెండు జిల్లాలనుంచి కాపుల్ని పిలిపించి.. వారితో మాట్లాడి బుజ్జగించి మాయమాటలు చెప్పి.. కనీసం వారి వరకు ముద్రగడ మీద సానుభూతి రాకుండా, ఆయనకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేకుండా చేయాలనేదే చంద్రబాబు వ్యూహమని, అందుకే కాపు సమావేశం పేరు చెప్పి.. ఆ రెండు జిల్లాల కాపులను ఆహ్వానించడం మీదనే ఫోకస్ పెట్టారని మిగిలిన ప్రాంతాలకు చెందిన కాపులు గుస్సా అవుతున్నారు.
Tags:    

Similar News