మోసం.. మోసం.. మోసం..

Update: 2015-08-12 13:14 GMT
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేయడమే కాదు.. తనను తాను కూడా మోసం చేసుకుంటోంది. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించడానికి కపడ నాటకం ఆడుతోంది. కేంద్రంలోని బీజేపీకి గట్టి హెచ్చరికను జారీ చేసినట్లు ప్రచారం చేసుకుంటోంది. కానీ, ఇప్పటికి ఈ అంశం మరుగున పడవచ్చు. చంద్రబాబును ప్రజలు నమ్మవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఈ అంశం టీడీపీకే నష్టం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ప్రత్యేక హోదావిషయంలో మునికోటి ఆత్మాహుతితో నవ్యాంధ్ర అట్టుడికిపోతోంది. ప్రతిపక్షాలన్నీ ఒక్కుమ్మడిగా టీడీపీ, బీజేపీలపై ఒత్తిడి తెస్తున్నాయి. పరిస్థితి ఎంతగా దిగజారింది అంటే.. నవ్యాంధ్రలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని.. ఏమాత్రం ప్రభావం చూపలేని సీపీఐ బంద్ కు పిలుపు ఇస్తే.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ మొత్తం బందయ్యింది. బస్సులు తిరగలేదు. విద్యా సంస్థలు తెరవలేదు. వాణిజ్య సంస్థలు మూసివేశారు. కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం తదితర పార్టీలు మద్దతు ఇచ్చామని చెప్పుకున్నా.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ఒక్కటే సీపీఐ తో చేతులు కలిపింది. ఆ రెండు పార్టీలూ కలిసి బంద్ ను దిగ్విజయం చేశాయి. బంద్ దిగ్విజయం కావడంతో చంద్రబాబుకు దిక్కుతోచలేదు. సీపీఐ ఇచ్చిన పిలుపుకే బంద్ విజయవంతం అవడం.. స్వచ్ఛందంగానే ప్రజలు బంద్ ను పాటించడంతో ఆయన వెంటనే స్పందించారు.

ప్రత్యేక హోదాపై ఎప్పట్లాగే కేంద్ర మంత్రులతో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. కాకపోతే గతం కంటే ఈసారి కాస్త గట్టిగా మాట్లాడారట. అయినా, అరుణ్ జైట్లీ మాటల్లో ఏమాత్రం మార్పు లేదు. ప్రత్యేక హోదా అనేది లేదని ఆయన తేల్చి చెప్పారు. దాని బదులు ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అంతా కలిసి మరోసారి ప్రకటనలు చేశారు. తప్పితే నవ్యాంధ్రకు ఒరిగింది ఏమీ లేదు.
Tags:    

Similar News