ముగిసిపోయిన పెళ్లికి మేళం వాయించాలా?

Update: 2016-09-14 05:53 GMT
ముగిసిపోయిన పెళ్లికి మేళం ఎందుకు? అలాగే కేంద్రం ఒప్పుకున్న అంశానికి మళ్లీ దౌత్యం - రాయబారం ఎందుకు? జనానికి ఇప్పుడు ఇదే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఏదో అనూహ్యమైనది జరుగుతున్నదని.. దానిని మాయ చేయడానికి నాయకులు రకరకాల మాటలు చెబుతున్నారని జనం అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దూతగా వెళ్లినట్లుగా చెప్పుకున్న గవర్నర్‌ నరసింహన్‌ పర్యటనలో మరేదో ఆంతర్యం ఉన్నదని జనం అనుమానిస్తున్నారు.

కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొండిచేయి చూపించి.. ప్యాకేజీ పేరిట వంచన రుచిచూపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అసెంబ్లీ సెషన్స్‌ ముగిసిన తర్వాత.. సీఎం చంద్రబాబునాయుడు రాజ్‌ భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ తో సుమారు గంటకు పైగా ఆంతరంగికంగా సమావేశం కావడం అందరికీ ఆసక్తికరంగా మారింది. దాని గురించి ఆయనేదో చెప్పుకొచ్చారు గానీ.. కీలకమైన ఓటుకు నోటు కేసు విచారణ గురించే చంద్రబాబు మాట్లాడారని, అంతా అనుకున్నారు. కొన్ని వారాల కిందట ఏసీబీ కోర్టు పునర్విచారణకు ఆదేశించినప్పుడు గవర్నర్‌ కేసీఆర్‌ తో భేటీ అయి.. ఈ కేసును చూస్తున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ ను పిలిపించుకుని మాట్లాడిన వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈనేపథ్యంలో జనానికి రకరకాల అనుమానాలు కలిగాయి.

బాబుతో భేటీ వెంటనే.. నరసింహన్‌ ఢిల్లీకి హటాత్‌ పర్యటన పెట్టుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్దత అడిగానంటూ ఆయన అక్కడ చెబుతున్నారు. నిజానికి ఈ ప్యాకేజీకి చట్టబద్దత కావాలని చంద్రబాబు అప్పట్లోనే అడిగారు. అలా చట్టబద్దత ఇవ్వడానికి వెంకయ్యనాయుడు - అరుణ్‌ జైట్లీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. అయినా కూడా అదే పనిగా తాను ఢిల్లీ వెళ్లినట్లు గవర్నర్‌ చెబుతోంటే.. అంతగా నమ్మశక్యంగా లేదని జనం అనుకుంటుండడం గమనార్హం. మరి హస్తినాపురం వేదికగా.. ఎలాంటి కొత్త రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయోనని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News