గ‌వ‌ర్న‌ర్‌ తో బాబు భేటీ!..విష‌య‌మేంటో?

Update: 2019-06-07 08:39 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు నిజంగానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ గుర్తుకు వ‌చ్చారు. నిన్న‌టిదాకా గ‌వ‌ర్న‌ర్ అంటే కస్సుమంటూ సాగిన చంద్ర‌బాబు... ఎన్నికల్లో ఘోర ఓట‌మి - వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తిరుగులేని మెజారిటీతో విజ‌యం నేప‌థ్యంలో చంద్ర‌బాబు డీలా ప‌డిపోయారు. ప్ర‌స్తుతం చంద్రబాబును ఓదార్చే కార్య‌క్ర‌మం జోరుగానే సాగుతోంది. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం హైద‌రాబాద్ వెళ్లిన చంద్ర‌బాబు... నేరుగా రాజ్ భ‌వ‌న్ కు వెళ్లారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో ఏకంగా గంట‌న్న‌ర పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత రాజ్ భ‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు హైద‌రాబాద్ లోని త‌న నివాసానికి వెళ్లిపోయారు.

గ‌వ‌ర్న‌ర్ తో భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడ‌కుండానే చంద్ర‌బాబు వెళ్లిపోవ‌డం చూస్తుంటే... కీల‌క అంశాల‌పై చ‌ర్చ కోస‌మే చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. విప‌క్ష నేత‌గా ఎంపికైన త‌ర్వాత తొలిసారిగా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు....ఏదో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే చ‌ర్చించేందుకు రాలేద‌ని - అలా వ‌చ్చి ఉంటే భేటీ త‌ర్వాత మీడియాతో మాట్లాడిన త‌ర్వాతే అక్క‌డి నుంచి వెళ్లేవారు క‌దా అన్న కోణంలోనూ ఆస‌క్తికర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఓ కొత్త త‌ర‌హా విశ్లేష‌ణ ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విష‌యంపై స్వ‌యంగా టీడీపీ నేత‌లు కూడా విభేదించే అవ‌కాశాలు లేని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో సీబీఐని రాష్ట్రంలో నిషేధిస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ర‌ద్దు చేశారు. అంటే.. ఇప్పుడు ఏపీలోకి సీబీఐ ఫ్రీగానే ఎంట్రీ ఇస్తుంద‌న్న మాట‌. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యాన్ని స‌మీక్షిస్తామ‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నేప‌థ్యంలో ఏ క్ష‌ణ‌మైనా చంద్ర‌బాబు - ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ - ఇత‌ర టీడీపీ నేత‌ల ల‌క్ష్యంగా సీబీఐ దాడులు జ‌రిగే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ కోణంలో త‌న‌కు కొంత మేర స‌మాచారం అంద‌గా... ఆ దాడుల నుంచి త‌న‌ను తాను కాపాడుకునేందుకే చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ ను ఆశ్ర‌యించిన‌ట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లోనూ జ‌గ‌న్ దూకుడుగానే వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఈ దూకుడు నుంచి కూడా త‌న‌ను తాను ర‌క్షించుకునే క్ర‌మంలోనే ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్టిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఏది ఏమైనా... జ‌గ‌న్ కేబినెట్ కొలువుదీరుతున్న త‌రుణంలో చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ తో సుదీర్ఘ భేటీ అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంద‌నే చెప్పాలి. అయితే గ‌వ‌ర్న‌ర్ తో చంద్ర‌బాబు భేటీ మ‌ర్యాద‌పూర్వ‌క‌మేన‌ని - దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

   

Tags:    

Similar News