తెలంగాణకు వచ్చినా కూడా బాబుకు పవన్ జపమే..

Update: 2018-11-29 04:20 GMT
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌కు మ్యాచ్‌ లు లేకుండా సొంతింట్లో ఉన్నప్పుడు కూడా రాత్రిళ్లు నిద్రలో సచిన్ టెండూల్కర్ కలలోకి వచ్చి భయపెట్టేవాడట. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా పవన్ కల్యాణ్ అలాగే కలలోకి వస్తున్నట్లుంది. ఆయన పవన్ కల్యాణ్‌ కు - ఆయన పార్టీ జనసేనకు దూరంగా తెలంగాణకు వచ్చి ప్రజా కూటమి తరుఫున ప్రచారం చేస్తున్నా కూడా మాటల్లో జనసేన అనే వస్తోంది. ప్రతి రోజూ జనసేనపై విమర్శలు చేయడం వల్లో ఏమో కానీ చంద్రబాబు మైండ్‌ లో జనసేన బాగా నాటుకు పోయినట్లుంది. ఖమ్మంలో తన అలనాటి ప్రత్యర్థి రాహుల్ గాంధీతో కలిసి ఒకే వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు తన మాటల్లో జనసేన పేరు తలచారు.. అయితే జరిగిన పొరపాటును సరిదిద్దుకోబోయి మరోసారి అదే పొరపాటు చేశారు. తొలుత జనసేన అన్న చంద్రబాబు ఆ వెంటనే తెలంగాణ జనసేన అంటూ మాట్లాడారు. నిజానికి ఆయన తెలంగాణ జన సమితి అనబోయి జనసేన అన్నారు.
   
అమరావతి నుంచి ఖమ్మం హెలికాప్టర్‌ లో ఎగిరొచ్చిన చంద్రబాబు కాంగ్రెస్‌ తో పొత్తు విషయంలో సభాముఖంగా వివరణ ఇచ్చుకున్నారు. దేశ అవసరాల కోసం కలిశామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన గురించి - నామమాత్రంగా ప్రస్తావించి ఊరుకున్నారు. విభజన హామీలు అమలు కావడంలేదనీ - కేంద్రంలోని మోడీ సర్కార్‌ - తెలుగు రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తోందని సెలవిచ్చారు. కేసీఆర్‌ - కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. మరి గత నాలుగేళ్లు మోదీతో కలిసి నడిచినప్పుడు ఆయనేం చేశారో మాత్రం చెప్పలేదు.
   
తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడిన చంద్రబాబు 'జై తెలంగాణ.. జై తెలంగాణ.. జై తెలంగాణ..' అంటూ అతికష్టమ్మీద గొంతు పెగిల్చారు. ప్రజా కూటమిని తెలంగాణలో గెలిపించాలనీ - అధికార పీఠమెక్కించాలనీ చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ప్రజా కూటమి పార్టీల పేర్లు ప్రస్తావిస్తూ తెలంగాణ జనసమితి అనబోయి జనసేన అన్నారు.


Tags:    

Similar News