2.30 గంట‌లు ఏం మాట్లాడారు?

Update: 2018-08-23 06:16 GMT
దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా ఒక గ‌వ‌ర్న‌ర్ ఇంటికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌ర‌చూ వెళ్ల‌టం.. గంట‌ల కొద్దీ ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం అన్న‌ది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే క‌నిపిస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి.. గ‌వ‌ర్న‌ర్ కు మ‌ధ్య‌నున్న స్నేహ‌బంధం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తూ ఉంటుంది. త‌న మంత్రుల‌కు సైతం స‌మ‌యం ఇవ్వ‌ని కేసీఆర్‌.. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద మాత్రం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చొని మంత‌నాలు జ‌రుపుతుంటారు.

అన్నేసి గంట‌లు మాట్లాడిన త‌ర్వాత బాగుండ‌ద‌నో ఏమో కానీ.. అన‌ధికారికంగా ఒక ప్రెస్ రిలీజ్ చేసి.. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలు.. సంక్షేమ ప‌థ‌కాల్ని గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చించిన‌ట్లుగా పేర్కొంటారు. అవే మాట‌ల్ని ప‌లు మీడియా సంస్థ‌లు అచ్చేయ‌టం కొన్నేళ్లుగా చూస్తున్న‌దే.

ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం గ‌వ‌ర్న‌ర్ తో భేటీల‌ను దాదాపుగా బంద్ చేశారు. గ‌తంలో ఏ చిన్న కార్య‌క్ర‌మైనా.. గ‌వ‌ర్న‌ర్ పిలిచినా వాలిపోయే చంద్ర‌బాబు.. ఇప్పుడు మాత్రం లిమిటెడ్ గా క‌లుస్తున్న వైనం క‌నిపిస్తున్న‌దే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు విజ‌య‌వాడ వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. బాబుతో భేటీ అయ్యారు.

ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ లేనంత‌గా రెండున్న‌ర గంట‌ల పాటు వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌టం విశేషం. ఈ రెండున్న‌ర గంట‌ల పాటు ఏం మాట్లాడుకున్నార‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. కేంద్రం విష‌యంలో బాబు దూకుడును సుతిమెత్త‌గా గ‌వర్న‌ర్ ప్ర‌స్తావించిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. మోడీ స‌ర్కారుతో రాజీ అన్న‌ది లేద‌ని.. హోదా విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న మాట‌ను బాబు తేల్చి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. తాను బ‌య‌ట ఒక‌టి లోప‌ల ఒక‌టి పెట్టుకోవ‌టం అన్న‌ది ఉండ‌ద‌ని.. తాను ఏదైనా ఓపెన్ గా ఉంటాన‌న్న మాట‌ను గ‌వ‌ర్న‌ర్ తో చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. నిజానికి అలాంటి మాట‌లు బాబు నోటి నుంచి వ‌స్తాయా?  అన్న‌ది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. బాబుకు సంబంధించిన లెక్క‌ల‌న్నీ గ‌వ‌ర్న‌ర్ కు తెలియ‌నివి కావు. విప‌క్ష నేత‌గా ఉన్న బాబు.. ఢిల్లీకి వెళ్లి ర‌హ‌స్యంగా నాడు కేంద్ర‌మంత్రిగా ఉన్న చిదంబ‌రం మాష్టార్ని క‌లిసి రావ‌టం మొద‌లు బాబుకు సంబంధించిన లెక్క‌లు చాలానే గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర ఉన్నాయి. అలాంట‌ప్పుడు మొహ‌మాటం లేకుండా గ‌వ‌ర్న‌ర్ తో ఏది ప‌డితే అది బాబు మాట్లాడ‌తార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. రాష్ట్రంలో పార్టీ ప్ర‌యోజ‌నాల మేర‌కే తాము వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ కు చెప్పార‌ని అంటున్నారు.వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సుదీర్ఘ భేటీలో.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని బాబుకు గ‌వ‌ర్న‌ర్ చెప్పిన‌ట్లుగా  తెలుస్తోంది. అయితే.. తాము మాత్రం షెడ్యూల్ ప్ర‌కార‌మే వెళ‌తామ‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో కేంద్రం నుంచి సందేశాన్ని బాబుకు గ‌వ‌ర్న‌ర్  చెప్పిన‌ట్లుగా స‌మాచారం. తానిప్పుడున్న ప‌రిస్థితుల్లో తానేమీ చేయ‌లేన‌ని.. హోదా విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న మాట కూడా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఎప్పుడూ లేని విధంగా గ‌వ‌ర్న‌ర్.. బాబుల మ‌ధ్య సుదీర్ఘ భేటీ రానున్న రోజుల్లో రాజ‌కీయంగా మ‌రిన్ని మార్పుల‌కు కార‌ణంగా మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News