అమ‌రావ‌తికి రెండో రాజ‌ధానులెన్ని బాబు?

Update: 2017-12-05 17:30 GMT
చుట్టు ఉన్నోళ్లు ఏమ‌నుకుంటారో అన్న ఆలోచ‌న లేకుండా మాట్లాడేయ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. ఒకే మాట‌ను అదే ప‌నిగా రిపీట్ చేయ‌టంతో బాబుకు బాబే సాటి. ఒక ముఖ్య‌మంత్రి ఇన్ని విదేశీ యాత్ర‌లు చేయొచ్చా? అన్న సందేహం క‌లిగేలా చేయ‌టంతో చంద్ర‌బాబుకు ఉన్న నేర్ప‌రిత‌నం ఇంకెవ‌రికి ఉండ‌ద‌ని చెప్పాలి. పీక‌ల్లోతు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఫ్రీ చేయ‌కున్నా ఫ‌ర్లేదు.. అదే ప‌నిగా అప్పుల భారాన్ని మీద వేయ‌టంతో మాత్రం బాబు రికార్డును బ్రేక్ చేయ‌లేని రీతిలో వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుంది.

2014లో తాను ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 18 విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టారు. ఈ ప‌ద్దెనిమిది దేశాల‌కు వెళ్లిన ప్ర‌తిసారీ.. ఆయా దేశాల్ని అమ‌రావ‌తి రెండో రాజ‌ధానిగా చేసుకోవాల‌న్న మాట‌ను చెప్పారు. అంతేనా.. తాను ఏ దేశం వెళితే.. ఆ దేశ భాష‌ను నేర్చుకోవాల‌ని.. ఉపాధి అవ‌కాశాలు దండిగా ఉంటాయ‌న్న మాట‌ను చెప్పేస్తారు.

బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల కార‌ణంగా ఏపీకి ఒరిగిందేమిటో బాబు అండ్‌కోకు మాత్ర‌మే బాగా తెలియాలి. సింగ‌పైర్‌.. జ‌పాన్‌.. దావోస్‌.. చైనా.. ట‌ర్కీ.. సింగ‌పూర్‌.. లండ‌న్‌.. థాయ్ లాండ్‌.. స్విట్జ‌ర్లాండ్‌.. క‌జికిస్థాన్‌.. ర‌ష్యా.. శ్రీ‌లంక‌.. అమెరికా.. దుబాయ్‌.. ద‌క్షిణ కొరియా ఇలా దేశాల మీద దేశాలు తిరిగేసే చంద్ర‌బాబు..ఆయా దేశాల్లోని న‌గ‌రాల్ని చూసినంత‌నే అమ‌రావ‌తి గుర్తుకు వ‌చ్చేస్తుంది. అస‌లు అమ‌రావ‌తికి ఒక క్యారెక్ట‌ర్ ఉందా?  లేదా? అన్న సందేహం క‌లిగేలా.. ఎక్క‌డికి వెళితే అక్క‌డ ఆ ప్రాంతాన‌ని అమ‌రావ‌తి రెండో రాజ‌ధానిగా చేసుకోవాల‌ని అడిగేస్తుంటారు.

చంద్ర‌బాబు అక్క‌డ అన్నారో లేదో.. ఆన్ లైన్ లో వ‌చ్చేసే ప్రెస్ నోట్‌ ను కించిత్ తేడా లేకుండా పై నుంచి కింద‌వ‌ర‌కూ రాసేసి.. అచ్చేస్తుంటారు. ఒక్క‌సారైనా స‌రే.. చంద్ర‌బాబు.. అమ‌రావ‌తికి రెండో రాజ‌ధానులు ఎన్ని ఉన్నాయ‌న్న ప్ర‌శ్న‌ను వేసిన పాపాన క‌నిపించ‌రు. బాబు చెప్ప‌టం.. దాన్ని మీడియా అప్ప‌జెప్ప‌టం చేసే క్ర‌మంలో ప్ర‌జ‌ల చెవుల్లో పెద్ద పెద్ద పువ్వులు.. కాయ‌లు పెట్టేస్తున్నా ప‌ట్టని వైనం క‌నిపిస్తుంది. చెప్పేందుకు బాబుకు బోర్ కొట్ట‌కున్నా.. వినే ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం బాబు మాట‌లు క‌ర్ణ‌క‌ఠోరంగా మారుతున్న వైనాన్ని గుర్తిస్తే మంచిది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న వేళ‌.. జ‌నాల‌కు మండేలా మాట‌ల్ని ఎంత త‌క్కువగా చెబితే అంత మంచిది.
Tags:    

Similar News