ప‌వ‌న్‌ కు బాబు మ‌ళ్లీ జీ హుజూరేనా...!

Update: 2019-07-02 04:21 GMT
ఏపీలో ఎన్నిక‌లు ముగిసి నెల‌న్న‌ర కూడా కావ‌డం లేదు.. అప్పుడే ప‌లు పార్టీల్లో పొత్తుల ముచ్చ‌ట ముందుకొస్తోంది. వచ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ఆ దిశ‌గా పాకులాడుతున్నాయి. ప‌లువురు నేత‌ల‌తో రాయ‌బారాలు న‌డిపేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డు కూడా.. ఏ ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌ని టీడీపీ అధినేత‌ - మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దారుణ ప‌రాజ‌యం పాల‌య్యారు. కేవ‌లం 23 అసెంబ్లీ - మూడు పార్ల‌మెంట్ సీట్ల‌ను మాత్ర‌మే ఆయ‌న గెలుచుకోగ‌లిగారు. దీంతో ఆయ‌న రాజ‌కీయ ప‌రిస్థితి ద‌య‌నీయంగా తయారైంది.

ఎక్క‌డ పొర‌పాటు జ‌రిగింది..? ఏయే సామాజిక‌వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌య్యాయి..?  ముఖ్యంగా కాపులు ఎందుకు ఆద‌రించ‌లేదు..? అనే అంశాల‌పై నేత‌ల‌తో స‌మీక్షిస్తున్నారు. చంద్ర‌బాబు స‌మీక్ష‌లు చేస్తున్నా ఆ పార్టీ నేత‌లు రాని  ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఆయ‌న సోమ‌వారం సాయంత్రం కాపు నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌భుత్వ హ‌యాంలో కాపుల‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చినా ఎందుకు దూర‌మ‌య్యారు..?  అన్న కోణంలో ఆయ‌న ఆరా తీశారు. ఇక్క‌డే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ కూడా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ తో క‌లిసి న‌డువాల‌న్న ప్ర‌తిపాద‌న కొంద‌రు నేత‌ల నుంచి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టి నుంచే జ‌న‌సేన‌తో క‌లిసి ప్ర‌భుత్వంపై పోరాడాల‌న్న యోచ‌న‌లో కాపు నేత‌లు సూచించిన‌ట్లు స‌మాచారం. చంద్ర‌బాబుతో భేటీ నేప‌థ్యంలో బోండా ఉమ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. జనసేన వల్ల దూరమైన ఓటు బ్యాంకును తిరిగి పొందుతామ‌ని.. జనసేనతో పొత్తు అంశం భవిష్యత్‌ లో తెలుస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. నిజానికి 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీ - జ‌న‌సేన‌లు పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. కానీ, ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌లేదు. కేవ‌లం ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ టీడీపీ - బీజేపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు.

ఇక ఈ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాల నేప‌థ్యంలో ఎవ‌రికి వారుగా పోటీ చేశారు. ఒంట‌రిగా పోటీ చేసిన టీడీపీ కేవ‌లం 23 అసెంబ్లీ - 3పార్ల‌మెంట్ స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఆ పార్టీకి సుమారు 40శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇక జ‌న‌సేన ఒక సీటుకే ప‌రిమితం అయింది. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ప‌వ‌న్ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ పార్టీకి మాత్రం 10 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌ తో మ‌ళ్లీ క‌లిసి న‌డిచేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇక ఇదే స‌మ‌యంలో బీజేపీ కూడా ప‌వ‌న్‌ తో పొత్తు పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.



Tags:    

Similar News