ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లాలా వ‌ద్దా? అనే దానికి చ‌ర్చేనా?

Update: 2019-05-29 04:39 GMT
పిల‌వ‌కుంటే వాళ్ల‌ది త‌ప్పు. పిలిచాక వెళ్ల‌కుంటే మ‌న‌ది త‌ప్పు అన్న మాట తెలుగు లోగిళ్ల‌లో త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. మాట‌లు స‌రిగా లేకున్నా.. రాజ‌కీయంగా.. ఇత‌ర‌త్రా విభేదాలు ఉన్నా.. ఏదైనా ఫంక్ష‌న్ జ‌రిగిన‌ప్పుడు వాటికి ఆహ్వానిస్తే వెళ్ల‌క‌పోవ‌టం త‌ప్పుగా భావించే క‌ల్చ‌ర్ తెలుగువారిలో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ఘోర ఓట‌మిని ఎదుర్కొన్నారు చంద్ర‌బాబు.

ఊహించ‌ని గెలుపుతో విజ‌యం సాధించిన జ‌గ‌న్‌.. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి బాబునుఆహ్వానించారు. ఫోన్ చేసి పిలిచారు. త‌న‌కున్న అనుభ‌వంతో రాష్ట్రభివృద్ధికి స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే.. జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళ్లాలా?  వ‌ద్దా? అన్న చ‌ర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది.

గ‌తంలో చంద్రబాబు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి జ‌గ‌న్ రాక‌పోవ‌టం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. జ‌గ‌న్ చేసిన‌ట్లే చంద్ర‌బాబు ఎందుకు చేయాలి? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. ఫోన్ చేసి పిలిచిన‌ప్పుడు పెద్ద‌రికంతో వెళ్లి.. ఆశీర్వ‌దించి రావాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబు మీద ఉంటుంది. ఇలాంటివేళ‌.. జ‌గ‌న్ ఏం చేశారు?  మ‌న‌మేం చేశామ‌న్న చ‌ర్చ కంటే కూడా.. కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టేలా ఉండాలే త‌ప్పించి.. వేలెత్తి చూపించే అవ‌కాశాన్ని ఇవ్వ‌కూడ‌దు.

ఈ రోజు టీడీపీ ఎల్పీ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని.. అందులో జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి వెళ్లాలా వ‌ద్దా? అన్న విష‌యం మీద చ‌ర్చిస్తామ‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి చిన్న విష‌యాల మీద చ‌ర్చ అన‌వ‌స‌ర‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయంగా ప‌డ‌కున్నా.. ప్ర‌త్య‌ర్థి అయినా.. పిలిచిన‌ప్పుడు వెళ్లి రావ‌టం అన్న‌ది ప‌ద్ద‌తి అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. మ‌రి.. చంద్ర‌బాబు ఏం చేస్తారో?  చూడాలి.


Tags:    

Similar News