అనంతపురం ఎందుకు పట్టదు బాబు..?

Update: 2015-05-25 13:30 GMT
గోదావరి జిల్లాల మీద చూపిస్తున్న శ్రద్ధ.. సొంత జిల్లా మీద చూపించరంటూ చిత్తూరు జిల్లా ఎంపీ శివప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అయితే.. మూడు సీట్లు మాత్రమే ఇచ్చారంటూ కర్నూలు జిల్లాను చంద్రబాబు అస్సలు పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నోటి నుంచి కూడా పశ్చిమగోదావరి జిల్లా మాట వచ్చింది.

ఇంతకీ పశ్చిమగోదావరి జిల్లా అంటే చంద్రబాబుకు అంత మమకారం ఎందుకు? అత్యధిక సీట్లు ఇవ్వటంతో పాటు.. అధికారానికి చేరువ చేసిందన్నది ఒక కారణం. మరి.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లా మాత్రమే చంద్రబాబుకు అండగా నిలించాదా? అంటే లేదనే చెప్పాలి.

ఎందుకంటే.. ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకూ చంద్రబాబుకు అండగా నిలిచిన వారు. అంటే.. ఉత్తరాంధ్ర మొదలుకొని కోస్తా వరకూ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మరి.. రాయలసీమలో పార్టీకి పెద్దగా ఆదరణ లేని పరిస్థితుల్లో... అనంతపురం జిల్లాను బాబు అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే.. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాలు టీడీపీకే ఆ జిల్లా ప్రజలు పట్టం కట్టారు. అంటే మొత్తం సీట్లలో 80 శాతానికి పైగా సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి.

పశ్చిమగోదారి జిల్లాలోని 15సీట్లకు మొత్తం 15 సీట్లలోనూ టీడీపీ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది. విపక్షమే లేకుండా చేసింది. అలాంటి జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెడతానని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. టీడీపీని పెద్దగా ఆదరించని రాయలసీమలో అనంతపురం జిల్లా  పార్టీకి అండగా నిలిచిన విషయాన్ని చంద్రబాబు ఎందుకు మర్చిపోతున్నట్లు..?

చంద్రబాబు సర్కారు అధికారంలోకి రావటానికి తమ శక్తిమేర సాయం చేసిన జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒక్కటన్న విషయాన్ని మర్చిపోకూడదు. పశ్చిమగోదావరి జిల్లాలో 15కు 15 వస్తే అనంతపురం జిల్లాలో 14 సీట్లకు 12 తెలుగుదేశానికి వస్తాయి. మరి చంద్రబాబు ప్రకారం గెలిపించిన వారికి మర్యాద చేయాలని అనుకుంటటే అనంతపురం జిల్లాకు కూడా చేయాలి కదా. నిజానికి అనంతపురం జిల్లా వాసులు.. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగానే నిలుచున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అనంతపురం జిల్లాలోని హిందూపురంను ఎంచుకున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. భారీ మెజార్టీతో గెలిపించి.. నందమూరి కుటుంబానికి తాము విధేయులమన్న విషయాన్ని హిందూపురం ప్రజలు చెప్పకనే చెప్పేశారు.

ఎన్టీఆర్‌ తర్వాత.. కొన్ని దశాబ్దాల అనంతరం.. ఆయన కుమారుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బావమరిది కమ్‌ వియ్యంకుడైన బాలకృష్ణ హిందూపురం నుంచి బరిలోకి దిగితే.. తమ సొంత మనిషి మళ్లీ తమ దగ్గరకు వచ్చారని ఆనందపడిపోతూ ఓట్లేసి గెలిపించారు. అంతేకానీ.. తాము గతంలో గెలిపించిన దానికి ఏమీ చేయలేదన్న విషయాన్ని వారు అస్సలు పట్టించుకోలేదు.

అలా అని హిందూపురానికి పెద్దగా ప్రత్యేకతలు లేవంటే తప్పులో కాలేసినట్లే. నిజానికి విభజన నేపథ్యంలో ఏపీలోని ఏ ప్రాంతానికి లేనంత విలక్షణత హిందూపురానికి ఉంది. సముద్రమట్టానికి హైదరాబాద్‌ 505 మీటర్ల ఎత్తులో ఉంటే.. హిందూపురం 621 మీటర్ల ఎత్తులో ఉంది.

ఈ కారణంతోనే.. హైదరాబాద్‌లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో హిందూపురంలోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. అంతేకాదు.. హిందూపురం మూడు రాష్ట్రాలకు దగ్గరగా ఉంటుంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతేకాదు.. తమిళనాడు.. తెలంగాణ రాష్ట్రాలకు దగ్గరగా ఉండటమే కాదు.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో హిందూపురం ఉంది.

ఇంత సౌలభ్యం రాష్ట్రంలోని మరే పట్టణానికి లేదు. మరి.. అలాంటి పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలిచిన అనంతపురం జిల్లాను.. హిందూపురం నియోజకవర్గం పట్ల చంద్రబాబు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కదా. తమకు ఓట్లు.. సీట్లు ఇచ్చిన జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో అనంతను ఎందుకు ఆశ్రద్ధ చేస్తున్నట్లు..?

చంద్రబాబు సర్కారులో అనంతపురం జిల్లాకు సోలార్‌పార్క్‌ తప్పించి మరే ఇతర హామీ వచ్చింది లేదు. ప్రకటించిన సోలార్‌ పార్కు కారణంగా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? అంటే అది అనుమానమే. ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన హంగులన్నీ హిందూపురానికి ఉన్నప్పటికీ.. చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవటం శోచనీయం.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. రాష్ట్రం మొత్తాన్ని ఒకే విధంగా చూడాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తమకు అండగా నిలిచిన వారిపట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించటం తప్పేం కాదు. అదే సమయంలో మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయటం తగదు. సమానుల్లో అత్యధికుడన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీకి అండగా నిలిచిన వారికి.. తమ రుణాన్ని తీర్చుకోవాలని భావిస్తున్న చంద్రబాబుకు.. అనంతపురం అస్సలు కనిపించకపోవటం ఆవేదన కలిగించే అంశం.

ప్రకృతి చిన్నచూపుతో కష్టాలమయంగా ఉండే జిల్లా పట్ల.. చంద్రబాబులాంటి నేత సైతం చిన్నచూపు చూడటం బాధ కలిగించే అంశం. పార్టీతో పాటు.. పార్టీ అధినేత కుటుంబానికి సైతం అండగా నిలిచిన హిందూపురాన్ని.. ఆ నియోజకవర్గం నేతృత్వం వహించే అనంతపురం  జిల్లాపై ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం మర్చిపోకూడదు.



Tags:    

Similar News