పాత పాటే సుదీర్ఘంగా పాడేసిన చంద్రబాబు

Update: 2016-08-19 04:46 GMT
పాడిన పాటను పదే పదే పాడటం.. అందులో ఏమాత్రం కొత్తదనం లేకుండా చూసుకోవటం ఏపీముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. విభజన కారణంగా ఏపీ దారుణంగా నష్టపోయిందన్న మాటతో పాటు.. అన్నివిధాలుగా ఆదుకోవాల్సిన కేంద్రం తమను ఆదుకోవటం లేదన్న మాటను ఈ మధ్యన తరచూ చెబుతున్న చంద్రబాబు మరోసారి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ చాలా సమస్యలు ఎదుర్కొంటుందంటూ చిట్టా విప్పిన ఆయన.. పాత పాటను పాడేశారు.

42 శాతం ఉన్న తెలంగాణ జనాభాకు 53 శాతం ఆదాయాన్ని.. 58 శాతం ఉన్న ఏపీ జనాభాకు  47 శాతం ఆదాయ వనరుల విభజన జరిగిందంటూ లెక్కలు చెప్పిన ఆయన.. ఏపీ ఆర్థిక లోటును కేంద్రం పూడుస్తుందని చెప్పినా ఇప్పటివరకూ అలాంటిదేమీ లేదని చెప్పారు. తొలి ఏడాది రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటును కేంద్రం భర్తీ చేస్తుందని 14వ ఆర్థిక సంఘం హామీ ఇచ్చిన ఇప్పటికి రూ.2800 కోట్లు మాత్రమే ఇచ్చారని.. మిగిలిన నిధులను కేటాయించటం లేదని వాపోయారు.

రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిందేనన్న చంద్రబాబు భూగర్భ విద్యుత్ లైన్లకే రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇస్తామని పార్లమెంటులో కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ..ఇప్పటికి అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చిన ప్యాకేజీతో పోలిస్తే ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ చాలా తక్కువన్న విషయాన్ని చెప్పిన చంద్రబాబు.. విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైన వేటిని నేటికీ తీర్చలేదన్నారు.

ఆర్థిక లోటు.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు.. పోలవరం ప్రాజెక్టు.. విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం జోక్యం చేసుకోవాలని.. హైదరాబాద్ లోనే ప్రఖ్యాత సంస్థలు ఉండిపోయాయని.. ఇప్పటికిప్పుడు వాటి భవనాలు కట్టుకోవటానికి కూడా తమ దగ్గర నిధులు లేవని చంద్రబాబు వాపోయారు. కేంద్రం చేయాల్సిన పనుల చిట్టాను చెప్పుకొచ్చిన చంద్రబాబు ఎన్డీయేతో టీడీపీ పొత్తు గురించి మీడియా వేసిన ప్రశ్నలకు కాసింత చిత్రమైన సమాధానాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పుష్కరాలు నడుస్తున్నందున తాను రాజకీయాలు మాట్లాడనని ముక్తాయించారు. సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలకు తెలివిగా తప్పించుకోవటం ఏపీ ముఖ్యమంత్రిగా బాగానే తెలుసు.
Tags:    

Similar News