ఇలా కూడా బ‌లిచేస్తావా బాబు?

Update: 2016-06-26 05:53 GMT
దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ తమదేనన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖతో దానిని కూడా ఏపి ప్రభుత్వం - తెలంగాణ సర్కారుకు దఖలు పరుస్తుందా? అన్న చర్చకు తెరలేచింది. ఏపి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడే తమకు ఢిల్లీలో నిజాంభవన్ ఉండేదన్న వాదన తెలంగాణ రాష్ట్రం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్ తమకే కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాయడంతో, దానిపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చ మొదలయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కలసి ఉన్న ఏపీ భవన్ రాష్ట్ర విభజన తర్వాత విడిపోయింది. ఫలితంగా ఏపీకి 36 - తెలంగాణకు 26 గదులు కేటాయించారు. సైట్ 1 - సైట్ 2 - సైట్ 3 కలిపి ఏపీభవన్‌ కు మొత్తం 19.84 ఎకరాల భూమి ఉంది. సైట్ 1లో 8.42 ఎకరాలు - 2లో 7.64 ఎకరాలు - 3 పటౌడీహౌస్‌ లో 7.64 ఎకరాల భూమి ఉంది. ఏపి మద్రాసు రాష్ట్రంలో కలసి ఉన్నప్పుడే హైదరాబాద్ రాష్ట్రానికి నిజాంభవన్ ఉండేదని, మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత , ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో స్థలం కోసం కేంద్రాన్ని కోరలేదని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కూడా, ఏపీ ప్రభుత్వం తమకు ప్రత్యేక స్థలం కావాలని లేఖ రాయకుండా, తమ భవనాన్ని వాడుకుంటోందన్న వాదన తెరపైకి తెచ్చింది. సీఎం కేసీఆర్ కూడా ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమయింది. దీనితో ఇప్పటికే సచివాలయా న్ని వదులుకున్న ఏపి ప్రభుత్వం, ఇప్పుడు ఏపి భవన్‌ను కూడా వదులుకుంటుందా? లేక తమకూ ఢిల్లీలో స్థలం కావాలని లేఖ రాస్తుందా? అన్న అంశంపై చర్చకు తెరలేచింది.

నిజానికి హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టం స్పష్టం చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల రెండేళ్లకే విజయవాడ తరలిపోయిన వైనాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. సచివాలయం ఖాళీ చేసి, తెలంగాణ సర్కారుకు ఇచ్చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మౌఖికంగా తెలియచేసిన వైనంపై అప్పట్లోనే విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం వల్ల క్రమక్రమంగా హైదరాబాద్‌ పై పదేళ్ల వరకూ ఉన్న ఉమ్మడి హక్కును వదులుకోవలసి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపి భవన్‌ ను కూడా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తుందా? లేక తమ హక్కు కోసం పోరాడుతుందా? చూడాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేసులకు భయపడి తెలంగాణ ప్రభుత్వానికి బాబు దాసోహమయ్యారని, అందుకే నీటి పంపిణీలో అన్యాయం జరుగుతున్నా కేసీఆర్‌పై పోరాటం చేయడం లేదంటూ, వైసీపీ నేత జగన్ తరచూ ఆరోపిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.ఈ క్రమంలో ఏపీ భవన్‌పై ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుందా? లేక తెలంగాణ ప్రభుత్వంతో గొడవ ఎందుకుని ఇచ్చేస్తుందా చూడాలంటున్నారు. ఇప్పటికే సాగునీటిపై రెండు రాష్ట్రాల పంచాయితీ ఢిల్లీకి చేరిన నేపథ్యంలో, కొత్తగా ఏపిభవన్ వివాదానికి సీఎం కేసీఆర్ తెరలేపినందున, ఈ అంశం ఎటు పోతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Tags:    

Similar News