బాబుకు కొత్త తలనొప్పి మొదలైనట్లే

Update: 2016-07-09 04:48 GMT
కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇవ్వటం.. దాన్ని అమలు చేసే పనిలో భాగంగా మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే.. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కాపుల్ని బీసీల్లో ఎలా చేరుస్తారంటూ బీసీ సంఘాలు ఇప్పుడు గళం విప్పుతున్నాయి. రంగం ఏదైనా ఇప్పటికే అగ్రభాగంలోఉన్న కాపుల్ని బీసీల్లోకి ఎలా చేరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. భూస్వాములు.. అధికారులు.. సినిమా స్టార్లు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. వ్యాపారవేత్తలుగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్న కాపులు ఇంకా వెనుకబడటం ఏమిటంటూ ఏపీ బీసీ జేఏసీ వాదిస్తోంది.

కాపుల్ని బీసీల్లోకి చేర్చే అంశం మీద ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ ను తాజాగా కలిసిన బీసీ సంఘాలు తమ వాదనను వినిపించాయి. అన్ని రంగాల్లో వృద్ధిలో దూసుకెళుతున్న కాపుల్ని ఏ విదంగా బీసీల్లోకి చేరుస్తారని ప్రశ్నించటమే కాదు.. అందుకు తగ్గ గణాంకాల్ని వినిపిస్తున్నారు. ఏపీలో కాపుల జనాభా ప్రకారం 26 మంది ఎమ్మెల్యేలు.. ఐదుగురు మంత్రులు.. ఎంపీలు.. రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. కానీ ఏపీ జనాభాలో 50 శాతం ఉన్న బీసీల్లోని చాలా కులాలకు చెందిన వారు ఇప్పటివరకూ అసెంబ్లీ గడప కూడా తొక్కలేదంటూ వాపోతున్నారు. కాపులుసైతం బీసీలుగా మారితే.. తమకున్న అవకాశాలు కూడా వారే కొల్లగొట్టేస్తారని బీసీజేఏసీ వాదిస్తోంది.   

రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాపు కమిషన్ కు మాత్రం రూ.వెయ్యి కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.  కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే తమకెంత నష్టం వాటిల్లుతుందన్నఅంశంపై చరిత్రను సాక్ష్యాంగా చూపిస్తూ బీజేపీ జేఏసీ పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నరు. దామోదం సంజీవయ్య హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల్ని భర్తీ చేస్తే.. ఆ సమయంలో బీసీలుగా ఉన్న కాపులకు 96శాతం అవకాశాలు దక్కాయని.. ఇప్పుడు మళ్లీ కాపుల్ని బీసీల్లోకి చేరిస్తే అదే పరిస్థితి పునరావృతం అవుతుందని వాదిస్తున్నారు.

నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్న బీసీ ఆగ్రహం.. కాపుల్ని కానీ బీసీల్లోకి చేరుస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. బీసీల్లో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. బీసీలు చేస్తున్న వాదనకు ఏపీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు.. బీసీలకు అసంతృప్తి లేకుండా చేయటం.. కాపుల్ని బీసీల్లోకి తీసుకురావటం మాటలు చెప్పినంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమను బీసీల్లోకి చేర్చలేదంటూ కాపులు ఆందోళన చేసి ఏపీ సర్కారుకు షాకిచ్చిన క్రమంలో.. ఇప్పుడు బీసీలు సైతం ఆందోళనల బాట పడితే ఏపీ ముఖ్యమంత్రికి తలనొప్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ చిక్కుముడుల్ని బాబు ఎలా తీస్తారో చూడాలి.
Tags:    

Similar News