అవినీతిపై చంద్రబాబువి మాటలే

Update: 2016-01-03 22:30 GMT
నెలలో కనీసం పది రోజుల్లో ఏదో ఒక సందర్భంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడతారు. అవినీతిపరులను చీల్చి చెండాడతామని వ్యాఖ్యానిస్తారు. నెలలో కనీసం ఒకసారి అయినా ఆయన ప్రభుత్వ ఉద్యోగులపై విరుచుకుపడతారు. పాత రోజులు పోయాయని, పని చేయకుంటే ఇంటికి పంపిస్తానని, ఉద్యోగుల్లో అలక్ష్యాన్ని, అవినీతిని క్షమించనని చాలా గట్టిగా వ్యాఖ్యానిస్తారు. దాంతో పత్రికలు కూడా ఆయన వ్యాఖ్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తాయి.

విచిత్రం ఏమిటంటే, గతంలో అధికారంలో ఉన్న పదేళ్లు, ఇప్పుడు కూడా చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. మధ్యవర్తులకు దళారులకు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని ఆయన పిలుపునిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. రూపాయి లంచం ఇవ్వకుండా పని జరిగే రోజులు ఏపీలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు విచ్చలవిడిగా జీతాలు పెంచిన తర్వాత కూడా ఇదే పరిస్థితి.

ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపడానికి ఏసీబీకి పూర్తి అధికారాలు ఇవ్వరని, ఒకవేళ ఇచ్చినా దాడులు చేసిన తర్వాత లేదా ముందు అధికార పార్టీ నాయకులే జోక్యం చేసుకుంటారని, దాంతో అవినీతి కేసులన్నీ నీరుగారిపోతున్నాయని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే పనులకు హస్తిమశకాంతరం ఉంటుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి తగ్గుతోందని, అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ హయాం కంటే తీవ్రంగా విజృంభిస్తోందని వివరిస్తున్నారు. చంద్రబాబు మరికొన్నాళ్లు ఇవే మాటలు చెబితే తర్వాత ఆయన మాటలను వినేవాళ్లు కూడా ఎవరూ ఉండరని అంటున్నారు.

Tags:    

Similar News