నాగపూర్‌ కు వెళ్లి ఏం సాధించినట్లు?

Update: 2017-10-26 23:30 GMT
చంద్రబాబు నాయుడు మాటల డాంబికమే తప్ప.. ఆచరణలో సాధిస్తున్నది శూన్యం అని తెలియజెప్పే తాజా దృష్టాంతం ఇది. ఈ విషయంలో వ్యవహారం మొత్తం ఒక కొలిక్కి వచ్చేసింది గనుక.. సీఎం ప్రకటించిన మాటలకు భిన్నంగా - ఫలితం ఉన్నదనేది తేలిపోయింది. అయితే ఆయన చెప్పే మాటల్లో చాలా విషయాలకు సంబంధించి.. ఇప్పుడప్పుడే ఫలితం నిర్ధరణ అయ్యే సంగతులు కాదు. తాజా విషయంలో మాత్రం ఆయన అడ్డంగా దొరికిపోయారు.

ముఖ్యమంత్రి ట్రాన్స్ ట్రాయ్ సంస్థను తప్పించి.. పోలవరం ప్రాజెక్టు పనులు చేయడానికి కొత్త టెండర్లు పిలవాలని స్కెచ్ వేశారు. ఇలా కొత్త టెండర్లు పిలవాలనే వ్యవహారంపై చాలా మందికి చాలానే సందేహాలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే.. కొత్త టెండర్ల వ్యవహారాన్ని గడ్కరీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక్కడకు వచ్చినప్పుడు.. మౌనంగా ఉండి తిరిగి వెళ్లిన గడ్కరీ.. దీపావళికి ముందు... మీడియా చిట్ చాట్ లో కొత్త టెండర్ల ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన సమయంలో హడావుడిగా గడ్కరీ ఆ సమయంలో ఉన్న నాగపూర్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ రీతిగా.. చంద్రబాబు హడావిడిగా నాగపూర్ కు వెళ్లడాన్ని పార్టీ చాలా ప్రచారం చేసుకుంది. ఆయన కూడా క్షణం తీరిక లేకుండా ఇంత కష్టపడుతున్నా అంటూ నాగపూర్ వెళ్లడమూ - అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లడమూ - అక్కడి నుంచి అమెరికా వెళ్లడం గురించి చెప్పుకున్నారు. నాగపూర్ భేటీలో కూడా గడ్కరీ ఒక పట్టాన ఒప్పుకోకపోగా.. చంద్రబాబు వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఆయన ముందు ఉంచి.. వాటిలో ఏదో ఒకటి చేయండి.. కానీ వేగంగా పని పూర్తి కావాలి... అని కోరారు.

అయితే అవన్నీ కూడా గడ్కరీ తోసిపుచ్చేశారు. తాను మీడియా చిట్ చాట్ లో ఏదైతే చెప్పారో, దానికే కట్టుబడ్డారు. కొత్త టెండర్ల ప్రసక్తే లేదు. ఈ కాంట్రాక్టరుతోనే కాస్త వేగంగా పనులు చేయించేందుకు ప్రయత్నిస్తాం.. అనేదే కేంద్రం తరఫున ఆయన మాట.

మరి ఇప్పుడు సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. చంద్రబాబునాయుడు నాగపూర్ వెళ్లి ఏం సాధించినట్లు? రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రతిపాదనలకు ఒక శాతం  కూడా అనుకూల స్పందనను ఆయన రాబట్టలేకపోయారు. ఇలా జరిగిందంటే.. దానికి రెండే కారణాలు ఉండాలి. రాష్ట్రం పట్ల కేంద్రానికి శ్రద్ధ లేకుండా, ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసే ఉద్దేశం ఉండాలి. లేదా, చంద్రబాబునాయుడు చాలా అసమ్మతమైన ప్రతిపాదనలు చెప్పి ఉండాలి. ఈ రెండు కారణాల్లో ఏది నిజమైనా సరే.. ఆ కేంద్ర ప్రభుత్వంలో తాను కూడా భాగమైన చంద్రబాబు వైఫల్యం కిందికే వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News