బాబుకు ఇక రామ‌సుబ్బారెడ్డి అవ‌స‌రం లేద‌ట‌!

Update: 2017-07-07 05:07 GMT
పి.రామ‌సుబ్బారెడ్డి... మొన్న‌టిదాకా కాంగ్రెస్ పార్టీకి, ఆ త‌ర్వాత ఇప్పుడు వైసీపీ పెట్ట‌ని కోట‌గా ఉన్న జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌. త‌న తండ్రి కాలం నుంచి కూడా రామ‌సుబ్బారెడ్డి కుటుంబం టీడీపీలోనే కొన‌సాగుతూ వ‌స్తోంది. గ‌తంలో బాబు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ప‌నిచేసిన స‌మ‌యంలో రామసుబ్బారెడ్డి ఆయ‌న కేబినెట్‌లో కీల‌క మంత్రిగా ప‌నిచేశారు. అయితే షాద్ న‌గ‌ర్ జంట హ‌త్య‌ల కేసులో దోషిగా తేలిన రామ‌సుబ్బారెడ్డి జైలుకు వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత శిక్ష పూర్తి చేసుకుని వ‌చ్చిన ఆయ‌న ముందు నుంచి తాము కొన‌సాగుతూ వ‌స్తున్న టీడీపీనే న‌మ్ముకుని ఉన్నారు. దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి, ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల ప్ర‌భావం జిల్లాపై అధికంగా ఉంది. అంతేకాకుండా వైఎస్ సామాజిక వ‌ర్గానికే చెందిన రామ‌సుబ్బారెడ్డి ఏనాడూ వైఎస్ ఫ్యామిలీ ఉంటూ వ‌స్తున్న పార్టీ వైపు చూడ‌లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... ఆయ‌న టీడీపీని వీడాల‌న్న ఆలోచ‌న‌కే రాలేదు.

అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన రామ‌సుబ్బారెడ్డి... వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ప్ర‌స్తుత టీడీపీ నేత‌, రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు త‌లొంచిన ఆదినారాయ‌ణ‌రెడ్డి... టీడీపీలోకి వ‌చ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి ఎలా తీసుకువ‌స్తారంటూ రామ‌సుబ్బారెడ్డి అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో రామ‌సుబ్బారెడ్డికి ఎలాగోలా న‌చ్చ‌జెప్పిన చంద్ర‌బాబు... ఆదినారాయ‌ణ‌రెడ్డికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ఇదంతా బాగానే ఉన్నా... మొన్న‌టిదాకా ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డిలు ఇప్పుడు ఒకే పార్టీ కింద‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో క‌లిసి ప‌నిచేసుకుందామ‌న్న రీతిలో రామ‌సుబ్బారెడ్డి వెలుతుండ‌గా, రామ‌సుబ్బారెడ్డిని రాజ‌కీయంగా నామ‌రూపాలు లేకుండా చేసేందుకే ఆదినారాయ‌ణ‌రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. దీనిపై రామ‌సుబ్బారెడ్డి పార్టీ అధిష్ఠానానికి ప‌లుమార్లు ఫిర్యాదు చేసినా... ఫ‌లితం లేకుండా పోయింది.

రామ‌సుబ్బారెడ్డి ఫిర్యాదు మొత్తాన్ని విన‌డం, ఆ త‌ర్వాత దానిని మ‌రిచిపోవ‌డం పార్టీ అధిష్ఠానం వంతుగా మారిపోయింది. ఈ క్ర‌మంలో టీడీపీ అనుకూల మీడియాలో నిన్న ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం ప్ర‌సారమైంది. ఈ క‌థ‌నం ప్ర‌కారం... పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న రామ‌సుబ్బారెడ్డి పార్టీ అధినేత చెబుతున్న మాట‌ల‌ను కూడా లెక్క‌చేయ‌డం లేద‌ని, ఆదినారాయ‌ణ‌రెడ్డితో ఆయ‌న‌కు స‌యోధ్య కుదిర్చేందుకు చంద్ర‌బాబు చేస్తున్న య‌త్నాలు బెడిసికొట్టేలా రామ‌సుబ్బారెడ్డి చేస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా ఆదినారాయ‌ణ‌రెడ్డితో తాను క‌లిసిపోయేది లేద‌ని రామ‌సుబ్బారెడ్డే ప‌రోక్షంగా చెబుతున్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంద‌ని ఆ క‌థ‌నం చెప్పేసింది. ఇందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా ఆ క‌థ‌నం వండివార్చింది. ఆదికి మంత్రి ప‌దవి ఇస్తే... మీకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని రామ‌సుబ్బారెడ్డికి చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ట‌. నాడు చంద్ర‌బాబు చెప్పిన దానికి స‌రేన‌న్న రామ‌సుబ్బారెడ్డి తిరిగి వ‌చ్చేశారు.

అయితే ఎంత‌కూ ఆ హామీ... హామీగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించిన స‌ద‌రు క‌థ‌నం... ఆదికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన నేప‌థ్యంలో త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి మాత్ర‌మే స‌రిపోద‌ని, త్వ‌ర‌లోనే ఖాళీ కానున్న మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌విని కూడా త‌న‌కు ఇవ్వాల‌ని రామ‌సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నార‌ట‌. దీంతో ఏం చెప్పాలో తెలియ‌క చంద్ర‌బాబు మౌనం పాటించార‌ని ఆ క‌థ‌నం చెప్పింది. వాస్త‌వానికి రామ‌సుబ్బారెడ్డి ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు కోరే నేత కాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రామ‌సుబ్బారెడ్డి వ్య‌క్తిత్వం తెలిసి కూడా ఆ క‌థ‌నం ఆయ‌న‌పై బుర‌ద చ‌ల్లే విధంగా క‌థ‌నాన్ని ప్ర‌సారం చేయ‌డంతో రామ‌సుబ్బారెడ్డిని వ‌దిలించుకునేందుకే టీడీపీ సిద్ధ‌ప‌డిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే పొమ్మ‌న‌లేక రామ‌సుబ్బారెడ్డికి పొగ‌బెడుతున్న‌ట్లుగానే ప‌రిస్థితి ఉంద‌ని ఆ క‌థ‌నం చెప్ప‌క‌నే చెప్పేసిన‌ట్లైంద‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న.
Tags:    

Similar News