అదే మాట‌ను ఇంకెన్నాళ్లు చెబుతావు బాబు?

Update: 2017-04-09 05:46 GMT
చేయాల్సిన ప‌నుల్ని చేయ‌టం రాజ‌కీయ నేత‌లు ఎంత దూరంగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అదేం సిత్ర‌మో కానీ.. చేయాల్సిన వాటిని వ‌దిలేస్తే.. రావాల్సిన వాటి విష‌యంలోనూ అంతులేని సాగ‌దీత జ‌రుగుతున్నా.. చూసిచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకే సాధ్య‌మ‌వుతుంది. అప్పుడ‌ప్పుడు విభ‌జ‌న ఎపిసోడ్ ను తెర మీద‌కు తీసుకొచ్చేసి.. భావోద్వేగంతో నాలుగు మాట‌లు అనేసే చంద్ర‌బాబు.. నిజంగా తాను చెప్పే మాట‌ల మీద ఆయ‌న‌కున్న క‌మిట్ మెంట్ ఎంత‌న్న‌ది చూస్తే ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టం ఖాయం.

విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి గుండెకాయ లాంటి ప్ర‌త్యేక హోదా అంశాన్నిగాలికి వ‌దిలేసిన చంద్ర‌బాబు.. కీల‌క‌మైన హామీల అమ‌లు విష‌యంలో తాను గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా చెబుతుంటారు. త‌న గురించి బాబు ఎన్ని గొప్ప‌లు చెప్పుకుంటారో తెలిసిందే. మ‌రిన్నిగొప్పులు చెప్పుకునే ఆయ‌న‌.. త‌న‌కున్న కెపాసిటీ ప్ర‌కారం.. ఆయ‌న త‌లుచుకుంటే.. కేంద్రంలో ఆయ‌న‌కున్న ప‌ర‌ప‌తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. ఆయ‌న కోరింది ఏదైనా ఇట్టే జ‌రిగిపోవాలి. కానీ.. అలాంటిదేదీ జ‌రిగిన‌ట్లుగా క‌నిపించ‌దు.

ఏపీ హోదాకు.. బాబు త‌ల‌కు చుట్టుకొని వేలాడుతున్న ఓటుకు నోటు కేసు కార‌ణంగా.. హోదా ఆశ‌లు గాల్లో క‌లిపేశారు. ఇక‌.. మిగిలిన డిమాండ్ల‌లో కీల‌క‌మైన‌ది.. చ‌ట్టంలో పేర్కొన్న దాని ప్రకారం చేసి తీరాల్సిన‌ అంశాల్లో విశాఖ‌కు రైల్వే జోన్ ఒక‌టి. నిజానికి ఈ విష‌యం మీద రాష్ట్రం కానీ ప‌ట్టుద‌ల‌గా కూర్చొని ఉంటే.. కాస్త క‌ష్ట‌మైనా కేంద్రం ఆ ప‌నిని పూర్తి చేసేది. కానీ.. బాబు నుంచి ఒత్తిడి అంతంత మాత్రంగా ఉండ‌టంతో రైల్వేజోన్ సాధ‌నపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

విశాఖ‌కు రైల్వేజోన్ కేటాయిస్తే.. ప‌లురాష్ట్రాలు దాని కార‌ణంగా ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఒత్తిళ్ల‌కు మోడీ స‌ర్కారు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కార‌ణం చేత‌నేకాబోలు.. వీలైనంత‌వ‌ర‌కూ విశాఖ రైల్వే జోన్ ఉదంతాన్ని త‌క్కువ‌గా ప్ర‌స్తావించ‌టం క‌నిపిస్తుంది. విశాఖ రైల్వే జోన్ సాధ‌న కోసం తాము గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు చెబుతున్నారు. బాబు స్థాయి సీఎం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా.. ఒక రైల్వేజోన్ ఏర్పాటు చేయ‌టంలో స‌క్సెస్ కాక‌పోవ‌టం దేనికి నిద‌ర్శం? రైల్వే జోన్ సాధ‌న కోసం మూడేళ్ల నుంచి ఇదే మాట చెబుతున్న చంద్ర‌బాబు.. మ‌రెన్ని ఏళ్ల పాటు ఇదే విష‌యాన్ని చెబుతారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News