చంద్ర‌బాబు స్కెచ్ రెడీ అయింది

Update: 2015-12-13 10:11 GMT
తెలుగుదేశం అధ్యక్షుడు - ఏపీ సీఏం నారా చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల వ్యూహాన్ని సిద్ధం చేశారు. మ‌రో నాల్రోజుల్లో స‌మావేశాలు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాల విష‌యంలో అనుస‌రించాల్సిన విధానాల‌ను, ప్ర‌భుత్వం చెప్పాల్సిన పాయింట్ల‌ను త‌న టీంకు వివ‌రించారు. ఈ మేర‌కు తాజాగా జ‌రిగిన స‌మావేశంలో పార్టీ స‌భ్యుల‌కు ప్రాధామ్యాలు స్ప‌ష్టం చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేవ‌నెత్తే ప్ర‌తిపాయింట్‌కు స‌మాధానం ఉండాల‌ని వ్యూహ-ప్రతివ్యూహాలూ అంత ప‌క్కాగా ఉండాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ స‌మావేశాల కోసం ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక కమిటీ స‌భ్యుల‌కు సూచించారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌నీ వివ‌రాలు వెల్ల‌డించారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా తొలి నాలుగు రోజులూ శ్వేతపత్రాలపై చర్చ పెట్టి ఐదోరోజు ఇతర అంశాలపై చర్చిస్తామని, ఈమధ్యలో ప్రతిపక్షాలుచేసే విమర్శలను తిప్పి కొట్టే విధంగా పాలకపక్ష సభ్యులు వ్యవహరించాలని ఆదేశించారు. కరువుపై జిల్లాల వారీగా ప్రతిఒక్కరూ నివేదిక సిద్ధం చేసుకోవాలని, దీని ఆధారంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలని సూచించారు. కరువుపై తానే స్వయంగా వివరణ ఇస్తానని చంద్రబాబు కమిటీకి చెప్పారు. ముఖ్యంగా బాక్సైట్‌ విషయం పెద్దఎత్తున చర్చకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో సభ్యులందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. శ్వేతపత్రంలో అన్నీ ఉన్నాయని, సభ్యులందరూ దాన్ని అధ్యయనం చేయాలని సూచించారు.

కల్తీ మద్యంపై ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఎక్కువమంది ప్రతిపక్ష నాయకులే ఉన్నారని, ఇందులోనూ ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట, పొన్నూరు నియోజకవర్గాల్లో కల్తీ మద్యం కేసులో పట్టుబడిన విషయాన్ని ముందుకు తేవాలని సూచించారు. విజయవాడలో కల్తీ జరిగిన వైన్‌షాపు కాంగ్రెస్‌ నాయకుడిదేనని, ఇతను వైఎస్‌ఆర్‌ బతికున్నంతకాలం ముఖ్యఅనుచరుడిగా ఉన్నారనే విషయాన్ని తెలుగుదేశం సభ్యులే చర్చకు పెట్టాలని సూచించారు. కరువుపై చర్చలో అనంతపురం జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్త్తావించాలని, ఈ బాధ్యతను కాల్వ‌ శ్రీనివాస్‌ తో పాటు తాను చూస్తానని చెప్పినట్లు తెలిసింది. ఇరిగేషన్‌ విషయంలో పట్టిసీమ ప్రాజెక్టు, నదుల అనుసంధానం, కేంద్రం అభినందనలు తదితర విషయాలను ప్రస్తావించాలని సూచించారు. ఇసుక విషయంలో శ్వేతపత్రం విడుదల చేశామని, జిల్లాల్లో ఎక్కడైనా మహిళా సంఘాలకు బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేయించాలని ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై చర్చకొచ్చిన సమయంలో లాభాలు వచ్చిన విషయంపై అధికారపక్ష సభ్యులే చర్చించాలని ఆదేశించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తరువాత జలవనరుల ప్రాజెక్టులపై సుమారు రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని, ఒక్క ఏడాదిలో భారీఎత్తున ఖర్చుచేసి విషయాన్ని ప్రస్తావించాలని సూచించారు. ఈసారి ప్రశ్నలూ, సమాధానాలు మనవే ఉండాలని, అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ప్రతిపక్షానికి అవకాశమివ్వకూడదని నిర్ణయించారు. కాల్‌మనీ వ్యాపారంలో పాలుపంచుకున్న వారిపై కేసులు నమోదు చేశామని, ప్రతిపక్షం విమర్శ చేసినా కేసు నమోదైన నేపథ్యంలో అవసరమైతే ఎదురుదాడికి దిగాలని, గతంలో అరెస్టయినవారి వివరాలూ తీసుకోవాలని తెలిపారు.

ప‌రిణామాల‌న్నింటినీ లెక్క‌లోకి తీసుకుంటూనే టీం స్పిరిట్‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని బాబు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చ‌లో భాగ‌స్వామ్యం పంచుకోవాల‌ని  ఆయ‌న ఇచ్చిన ఆదేశాల‌ను తెలుగు త‌మ్ముళ్లు ఏ విధంగా పాటిస్తారో చూడాలి మ‌రి.
Tags:    

Similar News