దసరా తరువాత చంద్రబాబుకు మనశ్శాంతి

Update: 2015-09-19 06:38 GMT
ఇద్దరుముగ్గురు మినహా మిగతా ఏపీ మంత్రుల తీరుపై చంద్రబాబు మండిపడుతున్నారట... అయితే... సామాజిక, రాజకీయ, సీనియారిటీ కారణాలతో వారినేమీ అనలేక ఆయనలో ఆయనే మథనపడుతున్నారట. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా శాఖలపై పట్టు సాధించకపోవడం... తానెన్ని రకాలుగా వారిస్తున్నా అవినీతి మార్గాలవైపే చూస్తుండడం వంటి కారణాలతో మంత్రులు ఆయనకు కోపం తెప్పిస్తున్నారు.  అయితే... గతం కంటే సాఫ్టుగా మారిన చంద్రబాబు వారిని గట్టిగా గదమాయించలేక.. అలాఅని చూస్తూ ఊరుకోలేక బాగా ఫీలవుతున్నారట. గతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒకరిద్దరిని మందలించినా, చురకలు వేసినా వారు మారలేదు. మరికొందరు తమకేదో అవమానం జరిగినట్లుగా ఫీలయిపోయారు. దీంతో చంద్రబాబు లోలోన ఉన్న అసంతృప్తిని అణచుకుంటూ మంత్రివర్గ ప్రక్షాళనకు మార్గాలు వెతుకుతున్నారట.

పదేళ్ల తరువాత అధికారం దక్కడంతో చంద్రబాబు సామాజిక సమీకరణలు... పార్టీకి ఆదరణ... నాయకుల సీనియారిటీ, పొత్తులు వంటి ఎన్నో లెక్కలు వేసి మంత్రివర్గాన్ని కూర్చారు. అయితే... వారిలో చాలామంది ఆయన అంచనాలు, ఆయన స్పీడుకు తగ్గట్లు పనిచేయలేకపోతున్నారు. అలా అని వెంటనే వారిని మార్చినా తప్పుడు సంకేతాలు వెళ్తాయి... మిగిలినవారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్న కారణంతో ఇంతవరకు భరిస్తూ వచ్చారు. అయితే... కొత్త రాష్ట్రాన్ని పరుగులు తీయించడం... ప్రజల్లో నమ్మకం సంపాదించుకోవడానికి ఇంకెంత మాత్రం ఆలస్యం చేయడానికి లేదని... ఆలస్యం చేస్తే దెబ్బతింటామని గుర్తించిన చంద్రబాబు ఇప్పడు తన టీంను సెట్ రైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పనితీరుపై సర్వేలు... అవినీతిపై హెచ్చరికలతో మంత్రులను ఉరికిస్తున్నారు. సర్వేలను ఆధారంగా చేసుకుని మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారని సమాచారం.

తన టీం పనితీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రబాబుకు ఈ దసరా తరువాత ఆ ఆవేదన తగ్గుతుందని భావిస్తున్నారు. దసరా తరువాత ఆయన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి సరైన టీంను ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. ఇక అప్పుడే ఆయనకు మనశ్శాంతి దొరుకుతుంది.

Tags:    

Similar News