సెక్షన్‌ 8 ఇప్పుడు గుర్తుకొచ్చిందేంది బాబు..?

Update: 2015-06-11 04:28 GMT
ఏపీ ముఖ్యమంత్రికి ఉన్నట్లుండి సెక్షన్‌ 8 గుర్తుకు వచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 8ని కచ్ఛితంగా అమలు చేయాలని చంద్రబాబు ఇప్పుడు కోరుతున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. సెక్షన్‌ 8 అమలు గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాష్ట్ర విభజన జరిగి పన్నెండు నెలలు జరిగిన తర్వాత సెక్షన్‌ 8 గురించి ఉన్నట్లుండి ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీసింగ్‌ ఉండాలని.. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8 చెబుతోంది. అంటే.. ఈ మధ్య మంగళగిరిలో నిర్వహించిన సంకల్ప దీక్ష సమయంలో చంద్రబాబు చెప్పినట్లుగా.. హైదరాబాద్‌ మీద కేసీఆర్‌కు ఎంత హక్కు ఉందో.. తనకూ అంతే హక్కు ఉందన్న విషయాన్ని.. హైదరాబాద్‌ పోలీసింగ్‌ మీద తనకూ అధిపత్యం ఉండాలని బాబు తలుస్తున్నట్లు ఉంది.

అధికారంలోకి పన్నెండు నెలలు గడిచిన తర్వాత.. ఇంత కాలం లేంది.. బాబుకు ఇప్పుడే సెక్షన్‌ 8 ఎందుకు గుర్తుకు వచ్చినట్లు అన్న విషయం మీద చూస్తే.. ఇది మొత్తం తాను.. తన పార్టీ నేతలకు సంబంధించి యవ్వారం తప్పించి మరింకేమీ కనిపించదు. తన పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కుపోయిన నేపథ్యంతో పాటు.. అదే ఇష్యూలో చంద్రబాబుకు చెందినవిగా చెప్పే ఆడియో టేపు బయటకు వచ్చిన నేపథ్యంలో సెక్షన్‌ 8ను పదే పదే బాబు ప్రస్తావిస్తున్నారు. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే చట్టాలు గుర్తుకు రావటం.. జనాలకు అవసరమైనప్పుడు ఏ మాత్రం పట్టకపోవటం ఏమిటో చంద్రబాబే బదులు చెప్పాలి.

Tags:    

Similar News