పవన్ ప్రశ్నకు బాబు బదులు చెప్పారు

Update: 2016-02-02 06:11 GMT
తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రియాక్ట్ కావటం తెలిసిందే. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు గురించి తెలిసిన వెంటనే.. కేరళలో ఉన్న ఆయన హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరటమే కాదు.. సోమవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బాబు సర్కారు తీరుపై కొన్ని విమర్శలు చేశారు.

కాపు ఐక్య గర్జన సందర్భంగా అంత పెద్ద ఎత్తున జనం వస్తే.. భద్రతా బలగాలు ఎందుకు మొహరించలేదని.. పరిస్థితి అదుపు తప్పే సమయంలో ఎందుకు నియంత్రిచలేకపోయారంటూ ప్రశ్నలు వేశారు. నిఘా లోపాన్ని కూడా ఎత్తి చూపారు. పవన్ చేసిన రిమార్క్స్ ను ఏపీ ముఖ్యమంత్రి సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే.. పవన్ ప్రెస్ మీట్లో వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇవ్వటమే దీనికి నిదర్శనం. కాపుగర్జన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామని.. ఏ మాత్రం తేడాగా వ్యవహరించినా పరిస్థితులు అదుపు తప్పే మరింత హింస చెలరేగే అవకాశం ఉన్నందున ఆచితూచి వ్యవహరించినట్లుగా ఆయన చెప్పారు.

ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. హింసాత్మక ఘటనలు జరగకుండా గతంలో కఠినంగా వ్యవహరించిన బాబు సర్కారు కారణంగా ఆయన ఎన్ని అపప్రదల్ని మూటగట్టుకున్నారో తెలిసిందే. హింసాత్మక ఘటనల్ని నిలువరించే క్రమంలో సంఘ విద్రోహుల్ని గుర్తించటంలో ఏ మాత్రం పొరపాటు జరిగి ఆందోళనకారులకు ఏదైనా జరిగే.. సున్నితమైన ఈ ఇష్యూ మరిన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న భావనలోనే పోలీసుల్ని ఆచితూచి వ్యవహరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకారుల విషయంలో కఠినంగా వ్యవహరించొద్దన్న ఆదేశాలతోనే పోలీసుల వైఫల్యం మరింత ఎక్కువగా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News