కావేరి ఉదాహ‌ర‌ణ‌తో క్లాస్ తీసుకున్న బాబు

Update: 2016-09-13 10:56 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పొరుగు రాష్ట్రాలైన త‌మిళ‌నాడు - క‌ర్ణాట‌క‌లో ర‌గులుతున్న కావేరీ  వివాదం గురించి స్పందించారు. నీరు వ‌ల్ల రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగే ప‌రిస్థితి రావ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. నీటి నిర్వ‌హ‌ణ‌ - సంర‌క్ష‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూపొందించిన నీరు-ప్రగతిపై అధికారులతో చంద్ర‌బాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌గ్రంగా నీటిని స‌మ‌న్వ‌యం చేసుకోక‌పోతే ఎదుర‌య్యే తీవ్ర ప‌రిణామాల‌కు కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు ఇక్క‌ట్లే ఉదాహ‌ర‌ణ అని అధికారుల‌తో చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి పేరొందిన బెంగళూరులో కర్ఫ్యూ - ఆందోళనలు చెల‌రేగ‌డం ఆ ప్రాంతంపై త‌ప్ప‌కుండా ప్ర‌భావం చూపుతుంద‌ని చంద్ర‌బాబు ఒకింత ఆవేద‌న‌గా వ్యాఖ్యానించారు.

నీటిని సంర‌క్షించేందుకు తాను ముందు నుంచి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న‌నాటి అనుభ‌వాల‌ను ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు పంచుకున్నారు. నీరు-మీరు పేరుతో అప్పుడే నీటి ఇంకుడుగుంత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తుచేశారు. రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదని మ‌రోమారు  నీరు-ప్రగతిని తీసుకువ‌చ్చి నీటి సంర‌క్ష‌ణ‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నీటి సంక్షోభాన్ని అధిగమిస్తే అన్ని రంగాల్లో ప్రగతి సాధ్యమవుతుందన్నారు. న‌ధుల అనుసంధానం ఇందులో భాగ‌మ‌నేన‌ని చెప్పారు. ఈ దృష్ట్యా భూగర్భ జలాలను పెంచడం - సమర్థ నీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో పది చెరువుల పునరుద్ధరణ జరగాలని అధికారులకు చంద్ర‌బాబు ఆదేశించారు.

ఇదిలాఉండ‌గా భూగ‌ర్భ‌జ‌లాలను ఉప‌యోగించుకోవ‌డంలో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. లక్షమంది విద్యార్ధులను నీటి స‌ద్వినియోగం గురించి వివ‌రించి వారి సేవలు వినియోగించుకోవాలనే దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్నట్లు బాబు తెలిపారు. మ‌రోవైపు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోణంలో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటుతున్న‌ట్లు వివ‌రించారు.
Tags:    

Similar News