అమ‌రావ‌తి నిర్మాణం...ఇంకా ఊరింపులోనే!

Update: 2017-04-27 07:00 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది...ఎంద‌రిలోనూ ఉన్న ఈ సందేహానికి స‌మాధానం ఇచ్చే కొత్త వార్త వెలువ‌డింది. కొద్దిగా ఆలస్యమైనా నవ్యాంధ్ర ప్రజా రాజధాని నిర్మాణం అత్యంత అద్భుతంగా ఉండనుందట‌. ఈ విష‌యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.  వెలగపూడిలోని తన కార్యాలయంలో సీఆర్‌ డిఎ అధికారులతో సమీక్ష నిర్వహించిన స‌మావేశంలో ఈ మేర‌కు స్ప‌ష్ట‌త ఇచ్చారు. రాజధానిలో ప్రతి నిర్మాణం ప్రపంచంలోనే మేటి నిర్మాణంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. రాజధాని నిర్మాణ అకృతుల విషయంలో ఎక్కడా రాజీపడవద్దని - అత్యాధునికంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఈ నిర్మాణం కోసం ఇప్పుడు ఉన్న కమిటీలతో పాటు మరో రెండు సలహా కమిటీలను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక కమిటీలో మంత్రులు - మరో కమిటీలో వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీల సూచనలు, సలహాలను తీసుకుని ప్రపంచం మెచ్చే రీతిలో రాజధాని నిర్మాణం జరగాలన్నారు. డిజైన్లు కొంత ఆలస్యమైనా అనుకున్న షెడ్యూలు ప్రకారమే నిర్మాణం పూర్తి కావాలన్నారు.

ఇటీవల కేబినేట్‌ సమావేశంలో రాజధాని నిర్మాణ అకృతులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయాన్ని అధికారులకు గుర్తు చేయ‌డంతో అధికారులు - మంత్రులు సీఆర్‌ డిఎకు నివేదిక రూపంలో అందరి సలహాలు - సూచనలు స్వీకరించి అత్యుత్తమ ఆకృతులను ప్రతిపాదించాలని చంద్ర‌బాబు సూచించారు. అమరావతి ప్రజా రవాణా వ్యవస్థ డ్రైవర్‌ లేని విద్యుత్‌ బస్సులతో పాటు - మెట్రోరైలు - ఉంటాయని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. అదేవిధంగా తక్కువ దూరాలకు జలమార్గాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రాజధానిలో ఎక్కడికెళ్లాలన్న కేవలం 30నిమిషాల వ్యవధిలో చేరుకునేలా ప్రజా రవాణా వ్యవస్థ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. బస్‌ స్టేషన్లు - మెట్రో రైలు స్టేషన్లు - పార్కింగ్‌ ఏరియాలు అండర్‌ గ్రౌండ్‌ లో ఉండేలా చూడాలన్నారు. నగరంలోని రహదారి వలయాలు వాహనాలు సులభంగా వెళ్లేందుకు వీలుగా శాస్త్రీయ పద్దతిలో ఉండేలా నిపుణులతో చర్చించాలని స్పష్టం చేశారు. ఆ తరువాతే నిర్ణయాలు తీసుకో వాలని సీఆర్‌ డిఎ అధికారులకు సూచించారు.  అమరావతి అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం ఉండాలని చెప్పారు. రాజధానిలో సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లలో ఎక్కడా ఎండ కనిపించకుండా పచ్చని చెట్లు ఉండాలని పేర్కొన్నారు. రూ.19.5 కోట్ల వ్యయంతో అమరావతి సిటి గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నామని సీఆర్‌ డిఎ కమిషనర్‌ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయనిపాలెంలో సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఇది నగరం నడిబొడ్డున ఉండేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు. అమరావతికి సంబంధించిన భూత - భవిష్యత్‌, వర్తమానాలలో పరిణామాలకు అర్థంపటేలా రూపొందించాలన్నారు.

మ‌రోవైపు కృష్ణానది నుంచి అమరావతికి ఎన్ని వారధులు అవసరమవుతాయన్న అంశంపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్‌ డిఎ అధికారులను ఆదేశించారు. అమరావతి నగరానికి సరసన ఉన్న కృష్ణానది ప్రధాన ఆకర్షణగా ఉంటుందని - దీనిపై నిర్మించే వారధులు రాజధానికి మరింత వన్నె తెచ్చేలా డిజైన్లు ఉండాలని స్పష్టం చేశారు. కూచిపూడి ముద్రతో రెండు అంతస్థులుగా నిర్మించే వారధితో పాటు మరిన్నీ వారధులు ఎక్కడెక్కడ అవసరమవుతాయో సత్వరమే గుర్తించాలని ఆదేశించారు. విజయవాడలో ఉన్న రాజీవ్‌ గాంధీ పార్కు - కృష్ణానది - కాలువలకు అభిముఖంగా ఉన్న ప్రాంతాల అభివృద్థిపై సీఆర్‌ డిఎ అధికారులు ఒక ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. వారధి నుంచి పవిత్ర సంగమం వరకు ఉన్న ప్రదేశాన్ని అద్భుతంగా సుందరీకరించాలని, ఆ ప్రాంతంలో వాటర్‌ స్పోర్ట్సు - ఫుడ్‌ కోర్టులు - షాపింగ్‌ మాల్స్‌ - ఎమ్యూజ్‌ మెంట్‌ పార్క్‌ లు - రోజువారి ఎగ్జిబిషన్‌ లు - ఫిట్‌ నెస్‌ సెంటర్లు - ఓపెన్‌ ఆడిటోరియంలు - సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సీఆర్‌ డిఎకు సూచించారు. నగరానికి ఆవలివైపున ఉన్న ప్రదేశంలో సుమారు లక్ష జనాభాకు సరిపోయే విధంగా 30వేల ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతంలో ఏదైన ఒక పర్వతంపై అక్షరధామం తరహాలో ఒక దేవాలయాన్ని నిర్మించి అభివృద్థి చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News