మోడీ, కేసీఆర్ లతో కలిసి నడుస్తామన్నబాబు

Update: 2015-10-22 08:45 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగానికి ఆద్యంతమూ మంచి స్పందన కనిపించింది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనగానే ప్రజలు కరతాళ ధ్వనులతో తమ స్పందన తెలిపారు. ఏపీ 2020 నాటికి నంబర్‌వన్‌గా ఉంటుందని , ఉండాలని ఆశిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఏపీ తెలంగాణ కలిసి ముందుకు పోతాయన్నారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపినందుకు, అమరావతి నిర్మాణానికి సహకరించినందుకు , పిలవగానే వచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు

విభజన సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారిగా అందరం కలిసుండాలన్నదే తన అభిమతమని చెప్పారు. విభజన చట్టం వల్ల ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం లభించిందని ఆయన అన్నారు. ఇందుకు మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోడీని అభినందిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా పోలవరం అసలు నిర్మాణం అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమైన సందర్భంగా కేంద్రం ముందుకు వచ్చి పోలవరానికి జాతీయహోదా ఇవ్వడమే కాకుండా ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసి సహకరించిందన్నారు. అలాగే విద్యా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్న మన ఆకాంక్షకు అనుగుణంగా ఏడు జాతీయ విద్యా సంస్థలను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు.

మోడీ సహకారంతో ముందుకెళ్తామని... కేసీఆర్ సహకారంతో కలిసి సాగుతామని చంద్రబాబు ముక్తాయించారు.
Tags:    

Similar News