ఏ చంద్రుడు కృష్ణా పుష్కరాల విజేత?

Update: 2016-08-23 06:51 GMT
ఈ విషయాన్ని కచ్ఛితంగా ప్రస్తావించాల్సిందే. ఆలస్యమైనప్పటికీ కొన్ని అంశాల్ని రికార్డు చేయాల్సిన అవసరం.. బాధ్యత మీడియా మీద ఉంటుంది. కృష్ణా పుష్కరాలు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణలో బాగా జరుగుతున్నాయా? ఆంధ్రాలో బాగా జరుగుతున్నాయా? అన్న సందేహాలు.. చర్చలు లాంటివి జరుగుతున్నా.. రెండు చోట్లా సాన్నాలు చేసినోళ్లు ఉండకపోవటం.. ఒకవేళ ఉన్నా.. ఆ విషయాలు మీడియాలో వచ్చే అవకాశం ఉండదు. తాజాగా కొంతమంది మీడియా మిత్రులు (నలుగురు మాత్రమే) తెలంగాణలోనూ.. ఆంధ్రాలోనూ పుష్కర స్నానాలు చేసి వచ్చారు.

ఈ సందర్భంగా రెండు చోట్ల గమనించిన అంశాల్ని చెప్పుకొచ్చారు. ఇతర వర్గాలకు చెందిన వారు చూసే కోణానికి.. ఒక పాత్రికేయుడి కోణానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. అందుకే.. ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆసక్తిగా వినటం.. అందుకు తగ్గట్లే కొత్తకోణాలు బయటకు వచ్చాయి. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ విషయాన్ని నలుగురికి చెప్పాలనిపించింది.

ఇక నేరుగా విషయంలోకి వెళితే.. తొలుత ఈ మీడియా మిత్రులు తెలంగాణలోని సోమశిలకు వెళ్లి వచ్చారు. పుష్కర స్నానం చేసిన వచ్చాక అక్కడి ప్రకృతి రమణీయత.. పుష్కర స్నాన అనుభూతి వారి మనసును దోచుకుంది. ఇక.. ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు చూస్తే.. పుష్కర ఘాట్లను ఏర్పాటుచేయటం.. వసతులు కల్పించటం లాంటివి బాగున్నాయని.. నీళ్లు కూడా బాగుండటంతో ఎలాంటి ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చారు. కాకుంటే భోజనానికి మాత్రం తిప్పలు తప్పలేదని తేల్చారు.

సోమశిలకు వెళ్లి వచ్చిన ఐదారు రోజుల తర్వాత సరదాగా.. బెజవాడకు వెళ్లి వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వారికి వచ్చింది. ఏపీ రాజధాని ముంగిట్లో జరుగుతున్న కృష్ణా పుష్కరాల మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టటం.. భారీ ప్రచారం చేసిన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లు వగైరా ఎలా ఉన్నాయన్న విషయాన్ని చూడాలన్న ఉద్దేశంతో వారు వెళ్లి వచ్చారు.

బెజవాడకు వెళ్లి వచ్చిన మీడియా మిత్రులు ఊగిపోతున్నారు. విభజన కారణంగా మీడియా వ్యవహరిస్తున్న వైఖరిపై వారు మొదట కస్సు మన్నారు. ఏ రాష్ట్ర సమాచారం ఆ రాష్ట్రానికే అందించాలన్న ఉద్దేశంతో బెజవాడలో పుష్కరాల్ని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయాల్ని హైదరాబాద్ ఎడిషన్ లో కానీ.. తెలంగాణ ఎడిషన్ లో కానీ ఇవ్వకపోవటం కారణంగా.. రెండు రాష్ట్రాల్లో ఏర్పాట్ల పై మదింపు చేసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ బెజవాడలో కృష్ణా పుష్కరాల నిర్వహణ ఎలా ఉందన్న విషయం దగ్గరకు వచ్చేసరికి వారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడటం మొదలు పెట్టారు. గుళ్లు.. గోపురాలు.. మసీదులు కూలిస్తే కూల్చారు కానీ విజయవాడ మొత్తం మారిపోయిందని.. రోడ్లు విశాలంగా తయారు కావటంతో పాటు.. విజయవాడ మొత్తాన్ని అందంగా అలంకరించటంతో పాటు.. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారని చెప్పుకొచ్చారు.

ఆటోల్ని పూర్తిగా బంద్ చేయటమే కాదు.. ఆటో డ్రైవర్లకు రోజు రూ.500 చొప్పున ప్రభుత్వమే ఇచ్చేయటంతో ఒక్కటంటే ఒక్క ఆటో బయటకు రాని పరిస్థితి. ట్రైన్లో కానీ.. బస్సులోకానీ బెజవాడకు చేరకుంటే ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేశారని.. అది కూడా ప్రతి నిమిషం బస్సులు అందుబాటులో ఉండేలా చేశారని చెప్పుకొచ్చారు. ఏదైనా పుష్కర ఘాట్లలో రద్దీగా ఉంటే.. జీపీఎస్ ఆధారంగా ఆ సమాచారం ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తెలిసేలా చేయటం.. వెంటనే తాను మొదట వెళ్లే ఘాట్ కు కాకుండా.. రద్దీ తక్కువగా ఉన్న ఘాట్ కు వెళ్లేలా నిర్ణయం తీసుకొని వెళ్లటం ఆశ్చర్యకరంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.

ఇదొక్కటే కాదు.. రోడ్డు మీద చెత్త అన్నది లేకుండా చేయటం.. ఒకవేళ ఎవరైనా చెత్త కాగితాల్ని రోడ్ల మీద పడేస్తే.. వెంటనే దాన్ని తీసే ఏర్పాటు చూడటం.. వంద మీటర్లకు మంచినీళ్ల పాకెట్లు దొరికే ఏర్పాటు చేయటం.. ఘాట్ల దగ్గర మంచినీళ్ల డ్రమ్ముల్ని వీపుకు కట్టుకొని.. మంచినీళ్లు ఇవ్వటం.. బస్టాండ్.. రైల్వే స్టేషన్ల లో దిగిన చిన్న పిల్లల చేతులకు వారి తల్లిదండ్రుల పేర్లు.. మొబైల్ నెంబర్లతో కూడిన ట్యాగ్ లు కట్టించాలన్న రూల్ ను విధగా పాటించటం.. పుష్కర స్నానాలు చేసే చోట్ల.. పిల్లల్ని ఐదు నిమిషాలకు మించి పుష్కరస్నానం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఎందుకలా అంటే.. పుష్కర స్నానం పిల్లలు ఎక్కువ చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించేలా ప్రతి ఘాట్ లోనూ వాలంటీర్ల ఏర్పాటు జరిగిందని చెప్పారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఫుడ్ విషయంలో ఎలాంటి లోటు లేకుండా చేయటంలో సక్సెస్ కావటమే కాదు.. కడుపునిండా కమ్మటి భోజనం తినే వీలు కలిగిందని చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయవాడకు వెళ్లిన ప్రతి ఒక్కరూ బస్సు దిగి.. మళ్లీ బస్సు (అది ట్రైన్ కావొచ్చు.. కారు కావొచ్చు) ఎక్కే రెండు విషయాలకు తప్పించి.. మరెక్కడా జేబులో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం దాదాపు లేకుండా చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఏర్పాట్లు ఒక్క విజయవాడలోనేనా? లేక మిగిలిన చోట్లా? అన్న సందేహం వచ్చి.. మూడు గంటల పాటు అదే పనిగా పలువురు మీడియా మిత్రులకు ఫోన్ చేసి కంపేర్ చేసినప్పుడు వచ్చిన సమాచారం ఏమిటంటే.. విజయవాడతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉందని.. కాకుంటే ఈ ఏర్పాట్ల పట్ల పుష్కర యాత్రికులతో పాటు.. పుష్కరాలకు అతిధ్యం ఇచ్చిన ప్రాంతాల వారు మాత్రం ఫుల్ హ్యాపీ అని చెబుతున్నారు.

అన్నింటికంటే ఆసక్తికరమైన మరో విశేషం ఏమిటంటే.. అతిధ్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గోదావరి జిల్లాల జనాలతో కృష్ణా.. గుంటూరుజిల్లాల ప్రజలు అతిధ్యం ఇచ్చే విషయంలో పోటీ పడటం. ఈ రెండింటి తర్వాత.. ఏ చంద్రుడు కృష్ణా పుష్కరాల విజేత అన్న విషయం ఎవరికి వారు చెప్పేయొచ్చేమో. ఒకవేళ డౌట్ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోని స్నేహితుల్ని.. బంధువుల్ని క్రాస్ చెక్ చేసుకుంటే.. మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకూ ఇదంతా ఎందుకు రాయాలన్న సందేహం కొందరికి వచ్చే అవకాశం ఉంది. మంచి ఎవరు చేసినా తెలుసుకోవటం.. ఇద్దరు చంద్రుళ్లలో ఒకరి ప్లస్ లను మరొకరు అందిపుచ్చుకోవటం ద్వారా తెలుగువారు మిగిలిన వారి కంటే దూసుకెళ్లే అవకాశాన్ని మిస్ కాకుండా ఉండటం కోసం మాత్రమే.
Tags:    

Similar News